తాజా బాగోతంలో రమేశ్ జార్కిహొళి
సాక్షి, బెంగళూరు: తరచూ ఏదో ఒక సెక్స్ బాగోతం కన్నడనాట రాజకీయాలను కుదిపేయడం పరిపాటిగా మారింది. రాసలీలలు, లైంగిక దాడులు, సీడీ గందరగోళాలు కర్ణాటక రాష్ట్రానికి కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా మంది మంత్రులు ఇలాంటి సెక్స్ స్కాండల్స్‌లో చిక్కుకుని రాజీనామాలు చేయాల్సి వచ్చింది. గతంలో మంత్రులుగా పనిచేసిన హెచ్‌వై మేటీ, హరతాళ్ హాలప్ప, లక్ష్మణ సవది, జె.కృష్ణ పాలేమార్, సీసీ పాటిల్ తదితర అనేక మంది సీడీల కారణంతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా రమేశ్ జార్కిహొళి వంతు వచ్చింది. గతాన్ని చూసైనా ఎవరూ మారడం లేదనేందుకు ఎప్పటికప్పుడు వస్తున్న స్కాండల్సే నిదర్శనం.
స్నేహితుని భార్యపై రేప్
2010, మే నెలలో బీజేపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల మంత్రిగా పనిచేసిన హరతాళ్ హాలప్ప స్నేహితుని ఇంటికి వెళ్లి అతని భార్యపై అత్యాచారం చేశారనే ఆరోపణలు మంత్రిపై వినిపించాయి. బాధితులు అప్పటి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో సంచలనమైంది. దీంతో అప్పటి సీఎం యడియూరప్ప వెంటనే హాలప్పను పిలిపించుకుని రాజీనామా చేయించారు. ఆ తర్వాత హాలప్పపై కేసు కూడా నమోదు అయింది. కోర్టులో హాలప్ప నిర్దోషిగా తీర్పు వచ్చింది. 2018లో హాలప్ప మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రేణుకాచార్య ముద్దుముచ్చట
2007లో బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య... జయలక్ష్మి అనే నర్సుతో ముద్దుముచ్చట సాగిస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే తనను మోసం చేశారని ఆమె ఫోటోలతో ప్రెస్‌మీట్ పెట్టారు. అప్పటినుంచి ఆయనకు మంత్రి పదవి అందరిని ద్రాక్ష అయ్యింది.
చట్టసభలో నీలి చిత్రాల వీక్షణం
2012 ఫిబ్రవరి 7న విధానసభలో అశ్లీల చిత్రాలు వీక్షించారనే ఆరోపణలపై బీజేపీ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికింది. అప్పట్లో విధానసభలో సహకార మంత్రి అయిన లక్ష్మణ సవది, పర్యావరణ మంత్రి జె.కృష్ణపాలెమార్, మహిళా, శిశు సంక్షేమ మంత్రి సీసీ పాటిల్‌లు మొబైల్‌ఫోన్లలో అశ్లీల దృశ్యాలను చూస్తు ఉన్న దృశ్యాలు మీడియాలో కథనాలుగా ప్రసారం అయ్యాయి. మరుసటి రోజే ముగ్గురూ పదవులకు రాజీనామా చేశారు. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలెమార్ ఓడిపోగా మిగిలిన ఇద్దరూ గెలిచారు.
కూలీ మహిళతో మంత్రి
మూడేళ్ల కిందట సిద్ధరామయ్య ప్రభుత్వంలో అబ్కారీ మంత్రిగా ఉన్న మేటీ ఆయుర్వేద ఆస్పత్రిలో రోజూవారీ కూలీగా పనిచేస్తున్న మహిళను లైంగికంగా వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాగల్‌కోటలోని అతిథిగృహంలో ఆమెతో గడిపిన వీడియోలు వచ్చాయి. ఆ మహిళ తరఫున సామాజిక కార్యకర్త రాజశేఖర్ ములాలీ ఢిల్లీలో ఈ రాసలీలల దృశ్యాల సీడీని విడుదల చేశారు. దీంతో సిద్ధరామయ్య ఆయన చేత రాజీనామా చేయించారు.
జార్కిహొళి రాజీనామా
ఇప్పుడు ప్రస్తుత జలవనరుల మంత్రి రమేశ్ జార్కిహొళి వంతు వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక యువతిని నమ్మించి వాంఛలు తీర్చుకున్నారని వీడియో, ఆడియోలు విడుదలయ్యాయి. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు సంధించడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప బుధవారం జార్కిహొళి చేత రాజీనామా చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment