
డెహ్రాడూన్: హిమాలయాల్లో ఉన్న ప్రఖ్యాత కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం మూసివేశారు. ఈ ఆలయాలను భారీగా మంచుపడే శీతాకాలంలో ఏటా మూసివేస్తుంటారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను శనివారం ఉదయం 8 గంటలకు, యమునోత్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసినట్లు చార్‌థామ్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని పేర్కొంది. శీతాకాల బసకోసం ఆయా ఆలయాల్లోని బాబా కేదార్, మాత యమున విగ్రహాలను అందంగా అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్, ఖర్సాలీ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లినట్లు తెలిపింది. గంగోత్రి ఆలయం శుక్రవారం మూతపడగా, బద్రీనాథ్ ఆలయ ద్వారాలను ఈ నెల 20వ తేదీన మూసివేస్తారు.