న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ (ఈడీ)కేసులో తనకు ట్రయల్‌కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ మీద హైకోర్టు స్టే ఇవ్వడంపై ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) చీఫ్ కేజ్రీవాల్ ఆదివారం(జూన్23) సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సోమవారం(జులై24) ఉదయమే పిటిషన్‌ను విచారించాలని కేజ్రీవాల్ న్యాయవాదులు కోర్టును విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్20న ఈ కేసులో ట్రయల్‌కోర్టు ఇచ్చిన బెయిల్‌పై 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు విచారణ చేపట్టి అదే రోజు స్టే ఇచ్చింది. పిటిషన్‌పై తుది తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఈ లోపే కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో కే జ్రీవాల్‌ను ఈడీ ఈ ఏడాది మార్చిలో అరెస్టు చేసింది. అనంతరం ఆయనకు లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొడిగించాలని తిరిగి కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించగా కోర్టు నిరాకరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అత్యున్నత న్యాయ స్థానం సూచించింది.
వెంటనే కేజ్రీవాల్ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే కోర్టు తీర్పు రిజర్వు చేయడంతో ఆయన తిరిగి తీహార్ జైలులో లొంగిపోవాల్సి వచ్చింది.
తాజాగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవకుండా ఈడీ బెయిల్ రద్దు పిటిషన్ వేయడంతో హై కోర్టు కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment