గంట సేపు స్థిరంగా కంప్యూటర్ ముందు కూర్చోవడమే కష్టం... కానీ 24గంటలు కూర్చొని 81 కోర్సులను పూర్తి చేయడం. ‘ఇంపాజిబుల్!’ అనుకుంటున్నారా. కానీ సాధించి చూపించింది రెహనా షాజహాన్. కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన ఈ 25 ఏళ్ల మహిళ... అత్యధిక ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసిన వ్యక్తిగా అంతర్జాతీయ రికార్డు సాధించింది. రికార్డు కోసం బహ్రైన్ వెళ్లిన రెహనా... ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో.. ఇలా అనేక కంపెనీల నుంచి ఆన్‌లైన్ సర్టిఫికెట్లు పొందింది.
ఉదయం 8 గంటలకు మొదలుపెడితే.. రాత్రి 11 గంటలకల్లా 66 సర్టిఫికెట్లు వచ్చాయి. వరల్డ్‌రికార్డు నెలకొల్పాలంటే ఇంకోగంటలో 9 కోర్సులు పూర్తి చేయాలి. ఒకానొక దశలో వదిలేద్దామా? అనుకుంది. వెంటనే ఆ ఆలోచన విరమించుకుని.. గంటలో తొమ్మిది కోర్సులు పూర్తి చేసింది. సర్టిఫికెట్ రావాలంటే.. ఒక్కో కోర్సులో 70శాతం మార్కులు రావాలి. అన్ని మార్కులూ సాధించింది. దుబయ్‌లోని ఓ కంపెనీ హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న రెహనా.. తండ్రి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకోసం ఉద్యోగానికి రిజైన్ చేసి ఇటీవలే ఇండియా వచ్చింది. ఇక్కడా ఖాళీగా లేదు. విద్యార్థులకు కెరీర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్‌గా పనిచేస్తోంది. ఆన్‌లైన్ కోర్సులెలా చేయాలో గైడ్ చేస్తోంది.
ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే... రెహనా వాళ్ల చెల్లి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. సో చెల్లిలా ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలన్నది ఆమె కల. జామియా మిల్లియా ఇస్లామియాలో ఎంకామ్ ఎంట్రన్స్ రాసి... హాఫ్ మార్కుతో అడ్మిషన్ కోల్పోయింది. ఆ యూనివర్సిటీలో చేరాలంటే మరో ఏడాది ఆగాలి. వేస్ట్ చేయడమెందుకని ఎమ్‌ఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా డిస్టెన్స్ కోర్సుల్లో చేరింది.
ఆ తరువాత ఏడాదికే జామియాలో ఎంబీఏ సీటొచ్చింది. ఆ ఏడాది కేరళ నుంచి సీటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి రెహనా. కోవిడ్ టైమ్‌లోనే ఆమె ఎంబీఏ అయిపోయింది. ఇంటర్వ్యూలకు వెళ్తే... కోవిడ్ టైమ్‌ను ఎలా ఉపయోగించుకున్నావని అడుగుతారు. అప్పుడు గుంపులో ఒకరిగా మిగిలిపోగూడదని.. ఎంబీఏ పూర్తవ్వగానే... ఒక రోజు 24 గంటల్లో 55 ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేసింది. అదే విషయాన్ని ఆమె పనిచేసిన ఎన్జీవో సీఈఓతో చెబితే... వరల్డ్ రికార్డ్‌కు ఎందుకు ట్రై చేయకూడదని ఓ సలహా ఇచ్చారు. అలా 24 గంటల్లో 81 కోర్సులు పూర్తి చేసి ఇలా స్ఫూర్తిగా నిలిచిందన్నమాట!
Comments
Please login to add a commentAdd a comment