వెలుగులోకి ‘కోల్‌కతా’ వైద్యురాలి
తల్లిదండ్రుల ఫోన్‌కాల్ డేటా
కోల్‌కతా: కన్నబిడ్డను కోల్పోయిన విషయం తెలిస్తే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయే తల్లిదండ్రులను ఓదార్చుతూ ధైర్యం చెప్పాల్సిందిపోయి వారిని గందరగోళపరుస్తూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్‌జీ కర్ ఆస్పత్రి యాజమాన్యం వైఖరి తాజాగా బహిర్గతమైంది. కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యోదంతం మర్నాడు ఉదయం ఆస్పత్రి యాజమాన్యం ఆమె కుటుంబానికి చేసిన ఫోన్‌కాల్స్ డేటా తాజాగా మీడియాకు వెల్లడైంది. దీంతో సున్నితమైన అంశం పట్ల ఆస్పత్రి యాజమాన్యం ఎంత నిర్దయగా వ్యవహరించిందో అందరికీ అర్థమైంది. ఆగస్ట్ 9న ఉదయం 10 గంటలకు ఆస్పత్రి మహిళా అసిస్టెంట్ సూపరింటెండెంట్ చేసిన మూడు ఫోన్‌కాల్స్ వివరాలు ఇవీ..
మొదటి ఫోన్‌కాల్ ఉదయం 10.53 నిమిషాలకు..
వైద్యురాలి తండ్రి: అసలేం జరిగింది?
అవతలి వ్యక్తి: ఆమె ఆరోగ్య పరిస్థితి ఏం బాలేదు. ఆస్పత్రిలో చేర్పించాం. త్వరగా వచ్చేయండి
వైద్యురాలి తండ్రి: దయచేసి చెప్పండి. అక్కడేం జరిగింది?
అవతలి వ్యక్తి: ఆ వివరాలన్నీ డాక్టర్ చెప్తారు. మీ నంబర్ దొరికితే ఫోన్ చేశాం. ముందు మీరు బయల్దేరండి
వైద్యురాలి తండ్రి: అసలు మీరెవరు?
అవతలి వ్యక్తి: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. డాక్టర్‌ను కాదు.
వైద్యురాలి తండ్రి: అక్కడ వైద్యులే లేరా?
అవతలి వ్యక్తి: మేమే నీ బిడ్డను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చాం. వచ్చి మమ్మల్ని కలవండి
వైద్యురాలి తల్లి: ఆమెకు ఏమైంది?. డ్యూటీ లో లేదా? జ్వరం వచ్చిందా?
వైద్యురాలి తండ్రి: ఆమెకు సీరియస్‌గా ఉందా?
అవతలి వ్యక్తి: అవును. మీరు వీలైనంత త్వరగా వచ్చేయండి
ఐదు నిమిషాల తర్వాత రెండో ఫోన్‌కాల్..
అవతలి వ్యక్తి: ఆర్‌జీ కర్ ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నా
వైద్యురాలి తల్లి: చెప్పండి
అవతలి వ్యక్తి: బయల్దేరారా లేదా?
వైద్యురాలి తల్లి: బయల్దేరాం. ఇప్పుడు ఆమె ఎలా ఉంది?
అవతలి వ్యక్తి: ముందయితే రండి. వచ్చాక మాట్లాడుకుందాం. ఆస్పత్రిలో ఛాతీ విభాగాధిపతి ఆఫీస్‌కే నేరుగా రండి
వైద్యురాలి తల్లి: సరేనండి
మూడో ఫోన్‌కాల్...
వైద్యురాలి తండ్రి: హలో చెప్పండి
అవతలి వ్యక్తి: నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను. చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుంది. చనిపోయిందని అనుకుంటున్నాం. పోలీసులు కూడా వచ్చేశారు. ఆస్పత్రి వాళ్లం కూడా ఇక్కడే ఉన్నాం. త్వరగా రండి అని చెప్పడానికే మీకు ఫోన్ చేశాం
వైద్యురాలి తండ్రి: నేరుగా అక్కడికే వస్తున్నాం
వైద్యురాలి తల్లి: నా కూతురు నాకిక లేదు (బోరున విలపిస్తూ).
Comments
Please login to add a commentAdd a comment