
నాలుగు దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయి వర్షం
251.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
జల దిగ్బంధంలో రాజధాని నగరం
విద్యుదాఘాతంతో 9 మంది, నీట మునిగి ఒకరు మృతి
కోల్‌కతా: ఎడతెరిపి లేని భీకర వర్షం ధాటికి పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాతోపాటు పొరుగు జిల్లాలు గజగజ వణికిపోయాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం దాకా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. పది మంది మృతిచెందారు. వీరిలో తొమ్మిది మంది విద్యుదాఘాతానికి బలయ్యారు. మరొకరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతా నగరంలో గత నాలుగు దశాబ్దాల్లో ఇదే అతిపెద్ద వర్షం కావడం గమనార్హం.
24 గంటల కంటే తక్కువ వ్యవధిలో 251.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. 1986 తర్వాత ఈ స్థాయిలో భారీ వర్షం పడడం ఇదే తొలిసారి. గత 137 ఏళ్లలో ఇది ఆరో అతిపెద్ద వర్షంగా రికార్డుకెక్కింది. నగరంలో రహదారులు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. మంగళవారం విద్యా సంస్థలు మూసివేశారు. నవరాత్రుల సందర్భంగా దుర్గాపూజలకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 25 దాకా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 27 దాకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దుర్గా మండపాల్లోకి నీరు
కోల్‌కతాలో దయనీయ దృశ్యాలు కనిపించాయి. గరియా జోధ్‌పూర్ పార్కు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయాయి. వంట సరుకులు పనికిరాకుండా పోవడంతో జనం ఆకలితో అలమటించారు. నగరమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. మోకాలి లోతు నీటిలోనే జనం బయటకు వచ్చారు. దుకాణాల్లో వస్తువులు సైతం మునిగిపోవడంతో యజమానాలు లబోదిబోమన్నారు. భారీగా నష్టపోయామని చెప్పారు. కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
కాలువులు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దుర్గా మండపాలు సైతం నీట మునిగాయి. విగ్రహాలతోపాటు అలంకరణ సామగ్రి దెబ్బతినే ప్రమాదం ఉండడంతో నీటిని బయటకు పంపించేందుకు కారి్మకులు శ్రమించారు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వర్షం కారణంగా పలు స్టేషన్ల మధ్య మెట్రో రైళ్లను నిలిపివేయాల్సి వచి్చంది. ప్రతికూల వాతావరణం వల్ల 30 విమానాలను రద్దుచేశాయి. 31 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూర్వ మేదినీపూర్, పశి్చమ మేదినీపూర్, జార్‌గ్రామ్, బంకూరా తదితర జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇంతటి వర్షం ఏనాడూ చూడలేదు: మమతా బెనర్జీ
ఇలాంటి కుండపోత వర్షం తాను ఏనాడూ చూడలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. పది మంది మృతిచెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆమె మంగళవారం ప్రజలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రైవేట్ విద్యుత్ సరఫరా సంస్థ సీఈఎస్‌సీ ఎలాంటి రక్షణ లేకుండా కరెంటు వైర్లను వదిలేయడం వల్ల విద్యుత్ షాక్‌తో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. కోల్‌కతాలో విద్యుత్ సరఫరా బాధ్యత ప్రభుత్వానికి కాదని, సీఈఎస్‌సీ కాంట్రాక్టు దక్కించుకుందని తెలిపారు. బాధిత కుటుంబాలకు సీఈఎస్‌సీ సంస్థ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. అలాగే కనీసం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అయ్యప్ప చుట్టూ రాజకీయం!