
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పట్టపగలు నడిరోడ్డు మీద కిలేడీ వీరంగం సృష్టించింది. రోడ్డు మీద నిల్చున్న యువతి చేతిలో నుంచి మొబైల్ లాక్కెళ్లింది. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన యువతిని జుట్టుపట్టుకుని చితకబాదింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఈ సంఘటన ఢిల్లీ సుల్తాన్‌పూరి ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సుల్తాన్‌పూరి క్రిషన్ విహార్ ప్రాంతానికి చెందిన యువతి రోడ్డు మీద నిల్చుని ఉంది. ఇంతలో అటుగా వచ్చి కిలేడీ యువతిని గమనించి ఆమె వద్దకు వచ్చి.. చేతిలోని మొబైల్‌ని లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. యువతి ప్రతిఘటించడంతో ఆమె జుట్టు పట్టుకుని చితకబాదింది. యువతిపై పిడిగుద్దులు కురిపించి.. ఆమె మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడ నుంచి ఉడాయించింది.
బాధితురాలు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితురాలిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దాదాపు 50 మందిని ప్రశ్నించారు. చివరకు నిందితురాలిని మంగోలిపూరి ప్రాంతంలో గుర్తించారు. మహిళా చైన్ స్నాచర్‌ని అరెస్ట్ చేసి.. ఆమె వద్ద నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment