న్యూఢిల్లీ: ‘లక్షద్వీప్–మాల్దీవుల’ వివాదం ముదురుతోంది. మన పర్యాటక రంగంపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ పిలుపుకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆ దేశ దౌత్యవేత్త అలీ నజీర్ మొహమ్మద్‌తో భారత హైకమిషనర్ మును ముహావర్ సోమవారం సమావేశమయ్యారు. భారత్ పట్ల, ప్రధాని మోదీ పట్ల మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను ఎండగట్టారు.
వారిని మాల్దీవులు ఇప్పటికే సస్పెండ్ చేయడం తెలిసిందే. అయినా దీనిపై భారతీయ సమాజంలో ఆగ్రహావేశాలు తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, శ్రద్దా కపూర్, వెంకటేశ్ ప్రసాద్, వీరేందర్ సెహా్వగ్ తదితర సెలెబ్రిటీలు కూడా ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’కు జై కొట్టారు. మాల్దీవుల పర్యటన మానేసి లక్షద్వీప్, అండమాన్ వంటి భారతీయ రమణీయ కేంద్రాలకు వెళ్లాలంటూ ఫొటోలను షేర్‌చేశారు. మాల్దీవులతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించుకోవాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ పిలుపునిచి్చంది.
3,400 శాతం పెరిగిన సెర్చింగ్!
లక్షద్వీప్‌లో మోదీ పర్యటన తర్వాత ఆన్‌లైన్ వేదికల్లో భారత దీవుల కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగిందని మేక్‌మైట్రిప్ సంస్థ పేర్కొంది. మాల్దీవులకు పర్యాటకుల్లో భారతీయుల సంఖ్యే అత్యధికమని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. గతేడాది 2.09 లక్షల మంది భారతీయులు అక్కడికెళ్లారు. 2022లో 2.4 లక్షలు, 2021లో 2.11 లక్షల మంది పర్యటించారు. అంతేకాదు, కోవిడ్ కాలంలోనూ 63,000 మంది అక్కడ పర్యటించారు!
ట్రెండింగ్‌లో లక్షద్వీప్
మాల్దీవులకు బదులు భారతీయ పర్యటక కేంద్రాలకే వెళ్దామన్న సెలబ్రిటీలు పిలుపుతో లక్షద్వీప్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చింగ్ అనూహ్యంగా పెరిగింది. ‘లక్షద్వీప్’ పదంతో ప్రపంచవ్యాప్తంగా సెర్చింగ్ చేస్తున్న వారి సంఖ్య గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుందని ‘గూగుల్ ట్రెండ్స్’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈజ్‌మైట్రిప్ సంస్థ భారత్‌కు మద్దతుగా మాల్దీవులకు విమానాల బుకింగ్స్‌ను రద్దుచేసింది. ‘‘మాల్దీవులు/సీషెల్స్ మాదిరే లక్షద్వీప్‌లోని బీచ్‌లు, పరిసరాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడే పర్యటించండి’’ అని సంస్థ సీఈవో నిషాంత్ పిట్టి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment