పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఉత్తర 24 పరగణా జిల్లాలోని బసిర్హాట్ సబ్ డివిజన్‌లో ఉన్న సందేశ్‌ఖాలీలో బుధవారం అర్ధరాత్రి మరోమారు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. సందేశ్‌ఖలీలో రైతులు, పేదల భూములను టీఎంసీ నాయకులు ఆక్రమించారని, మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలున్నాయి.
టీఎంసీ నేతల వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఈ నిరసనల్లోకి దిగింది. టీఎంసీ నేత షాజహాన్‌తో సహా నిందితులందరినీ అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా సందేశ్‌ఖాలీలో కొనసాగుతున్న హింసాకాండ కారణంగా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు చీఫ్‌కి నోటీసు పంపింది.
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాలోని సందేశ్‌ఖాలీలో ఒక రాజకీయ నేత మద్దతుదారులు పేద మహిళలను హింసించారని ఆరోపిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన నివేదికలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్వీకరించింది. సందేశ్‌ఖాలీలో ఇటీవల జరిగిన సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేసేలా మానవ హక్కుల ఉల్లంఘనలను సూచిస్తున్నాయని కమిషన్ పేర్కొంది. ఈ ఘటనల్లో పాలుపంచుకున్నవారిపై చేపట్టిన చర్యలకు సంబంధించి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment