తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌పై ఢిల్లీ ఎల్జీ వ్యాఖ్యలు
తమ నేతను చంపేందుకు బీజేపీ కుట్ర అంటూ మండిపడ్డ ఆప్
న్యూఢిల్లీ: తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. వైద్యులు సూచించిన మందులను కూడా ఆయన వాడకపోవచ్చని పేర్కొన్నారు. తీహార్ జైలు సూపరింటెండెంట్ నివేదికను ప్రస్తావిస్తూ ఎల్జీ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌కు లేఖ రాసినట్లు రాజ్‌భవన్ వర్గాలు శనివారం తెలిపాయి.
కేజ్రీవాల్‌కు ఇంటి వద్ద నుంచి వచ్చిన ఆహారాన్ని సరిపోను అందజేస్తున్నా కూడా ఆయన కావాలనే తక్కువ కేలరీలున్న ఆహారం తింటున్నట్లుగా ఆధారాలున్నాయన్నారు. గ్లూకో మీటర్ టెస్ట్ రీడింగ్‌కు, కంటిన్యువస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టం రీడింగ్‌కు మధ్య కనిపిస్తున్న భారీ వ్యత్యాసంపై అధికారులు పరిశీలన జరపాలని సూచించారు.
ఎల్జీ వైద్యుడనే విషయం తెలియదు
ఎల్జీ వీకే సక్సేనా రాసిన లేఖపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. నాకు తెలిసినంత మటుకు ఆయన గతంలో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారు. వీకే సక్సేనా డాక్టర్ అని, ఆరోగ్య అంశాల్లో మంచి నిపుణుడనే విషయం నాకు తెలియదు. ఎప్పుడైనా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌ను చదివి ఉండేవాళ్లం’ అంటూ ఎద్దేవా చేశారు. తమ నేతను చంపేందుకు బీజేపీ దుర్మార్గపు పథకం పన్నిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment