10 రాష్ట్రాలు, యూటీల్లో 96 స్థానాలకు ఎన్నికలు
13న జరగనున్న పోలింగ్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ప్రచారం శనివారంతో ముగిసింది. అవినీతి, నిరుద్యోగం, పేట్రేగిన ధరలకుతోడు అదానీ, అంబానీల నుంచి కాంగ్రెస్‌కు టెంపోల కొద్దీ నల్లధనం తరలింపు ఆరోపణలు, దక్షిణాది భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న శ్యామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యానాలు, అయ్యర్ పాక్ అణుబాంబు మాటలపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పర దూషణలు నాలుగోదశ ప్రచారానికి మరింత వేడిని అందించాయి.
బరిలో దిగ్గజాలు..
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్(యూపీలోని కనౌజ్), కేంద్ర మంత్రులు గిరిరాజ్‌సింగ్ (బిహార్‌లోని బెగుసరాయ్), నిత్యానంద్ రాయ్(బిహార్‌లోని ఉజియాపూర్), కాంగ్రెస్ నేత అ«దీర్ రంజన్ చౌదరి(పశ్చిమబెంగాల్‌లోని బహరాంపూర్), బీజేపీ నాయకురాలు పంకజ ముండే(మహారాష్ట్రలోని బీడ్) తదితరులు మే 13న జరిగే నాలుగోదశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2021నాటి లఖీంపూర్‌ఖేరీ రైతుల మరణాల కేసులో నిందితుడైన ఆశిశ్ తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈసారి యూపీలోని ఖేరీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం కోసం చెమటోడుస్తున్నారు.
నాడు 40 చోట్ల ఎన్‌డీఏ విజయం
నగదుకు ప్రశ్నలు ఉదంతంలో పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా మరోసారి బెంగాల్‌లోని కృష్ణానగర్ నుంచి పోటీకి నిలబడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున షియా నేత అఘా సయ్యద్ రుహుల్లా మెహ్దీ, పీడీపీ తరఫున వహీద్ పారా, ఆప్ తరఫున ఆష్రాఫ్ మీర్ పోటీచేస్తున్నారు. ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్‌వానీ గెలుపు దాదాపు ఖాయమైంది.
ఇక్కడ ‘నోటా’కు ఓటేయాలని కాంగ్రెస్ ప్రచారంచేసింది. నాలుగోదశలో పోలింగ్ జరుగుతున్న ఈ 96 స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 40 చోట్ల విజయం సాధించింది. ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటిన జరగనున్నాయి. అన్నింటికీ కౌంటింగ్ జూన్ 4వ తేదీన చేపడతారు. ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు నాలుగుదశల్లో జరగనున్నాయి. వీటిలో తొలి దశలో 28 స్థానాలకు సంబంధించిన ప్రచారం సైతం శనివారమే ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment