కాంగ్రెస్ వస్తే వారసత్వ పన్ను ∙ జనం ఆస్తులపై ‘పంజా’
మోదీ సంచలన ఆరోపణలు
ఆస్తుల బదిలీపై పన్ను వేస్తారట
యువరాజు సలహాదారే చెప్పారు
బతికున్నా, మరణించినా మోతే
రిజర్వేషన్లను కాపాడేది మేమే ఛత్తీస్, ఎంపీ ర్యాలీల్లో ప్రధాని
అంబికాపూర్/సాగర్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నుతో ప్రజల నడ్డి విరవడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. బతికున్నంత కాలం ప్రజలను పన్నులతో పీడించడమే గాక మరణించిన తర్వాత కూడా వదలకుండా లూటీ చేసే కుట్రలకు పదును పెడుతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా తాజాగా సంపద పంపిణీ గురించి మాట్లాడుతూ అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమన్నారు. ‘‘మరణించిన వారి ఆస్తులపైనా కాంగ్రెస్ పంజా (హస్తం గుర్తునుద్దేశించి) విసరనుంది. వారసత్వంగా పిల్లలకు దక్కకుండా లాగేసుకోనుంది. ‘జిందగీ కే సాథ్ భీ... జిందగీ కే బాద్ భీ... (బతికున్నప్పుడు కూడా, చనిపోయాక కూడా)’.
ఇదే కాంగ్రెస్ నయా దోపిడీ మంత్రం!’’ అని ఎల్‌ఐసీ పాపులర్ స్లోగన్ అన్వయిస్తూ ప్రధాని దుయ్యబట్టారు. ‘‘సమాజంలో సంపద పునఃపంపిణీ అనే ముసుగులో ప్రజల స్థిర చరాస్తులను జీవితాంతమూ, మరణించిన తర్వాతా అడ్డంగా లూటీ చేయడమే కాంగ్రెస్ విధానం. ఆ క్రమంలో చివరికి వారసత్వ ఆస్తులను కూడా వదలిపెట్టడం లేదు. కాంగ్రెస్ తాలూకు ఈ రహస్య అజెండాను, పిట్రోడా వ్యాఖ్యలు బయటపెట్టాయి.
మన సామాజిక, కుటుంబ విలువలకు కాంగ్రెస్ పూర్తిగా దూరమైపోయింది. అందుకే ప్రజల జీవితాంతం పొదుపు చేసి తమ వారసులకు అందజేయాలనుకునే సొమ్మును కూడా చట్టబద్ధంగా లాగేసుకోవాలని కుట్ర చేస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఇలాంటి ప్రమాదకర ఆలోచనలన్నీ ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి’’ అని బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ ఎన్నికల ర్యాలీలో మోదీ తూర్పారబట్టారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్, హర్దా ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే...
చట్టబద్ధంగా దోచేస్తారు
‘‘మీ (ప్రజల) ఆస్తులను, మీ పిల్లల హక్కులను కాజేయడానికి కాంగ్రెస్ పథకం వేసింది. జనం ఆస్తులను, పిల్లల కోసం జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న మొత్తాలను చట్టబద్ధంగా దోచేయజూస్తోంది. మధ్యతరగతి ప్రజలపై, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొనేవారిపై మరింత పన్ను విధించాలని కాంగ్రెస్ యువరాజు (రాహుల్) సలహాదారు (పిట్రోడా) అంటున్నారు.
గతంలో యువరాజు తండ్రికి కూడా ఆయనే సలహాదారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే తల్లిదండ్రుల నుంచి సంతానానికి వారసత్వంగా వచ్చే ఆస్తులపై కచ్చితంగా పన్ను విధిస్తుంది. అప్పుడిక తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు బదిలీ కావాలంటే పన్ను కట్టాల్సిందే. బతికున్నంత కాలమూ మీనుంచి వీలైనంతగా పన్నులు పిండుతారు. మరణించాక వారసత్వ పన్ను విధిస్తారు!
ఓబీసీలకు కాంగ్రెసే అతి పెద్ద శత్రువు
‘‘మతపరమైన రిజర్వేషన్ల నుంచి వెనక్కి తగ్గే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు. అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించి, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మరో వర్గానికి వర్తింపజేస్తుంది. ఇందులో సందేహం లేదు. కర్ణాటకలో గతంలో కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మతాధారంగా రిజర్వేషన్లు అమలు చేశారు.
అక్కడ బీజేపీ అధికారంలోకి అవి రద్దయ్యాయి. కొన్ని నెలల క్రితం కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్ద పాపం చేసింది. ముస్లింల్లోని అన్ని వర్గాలను ఓబీసీ కేటగిరీలో చేర్చి దొడ్డిదారిన రిజర్వేషన్లు ఇచ్చేసింది. దీనివల్ల ఓబీసీ కేటగిరీలోని ఇతర కులాలకు అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆటతో భవిష్యత్తు తరాలు నాశనమవుతాయి. దేశమంతటా కర్ణాటక మోడల్ అమలు చేయడానికి కుట్ర పన్నింది’’
రాజ్యాంగమంటే కాంగ్రెస్‌కు లెక్కలేదు
‘‘ఎన్నికల్లో నెగ్గడానికి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మతాధారితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలో బలహీన ప్రభుత్వం అధికారంలోకి రావాలని కొన్ని శక్తులు కోరుకుంటున్నాయి. బలమైన ప్రభుత్వముండి దేశం స్వావలంబన సాధిస్తే తమ దుకాణం మూత పడుతుందని ఆ శక్తులు భయపడుతున్నాయి. కాంగ్రెస్‌ది ముమ్మాటికీ ముస్లిం లీగ్ ఆలోచనా ధోరణే. ఆ పార్టీ మేనిఫెస్టో ముస్లింలీగ్ సిద్ధాంతాలకు నకలు.
మతాధారంగా రిజర్వేషన్లు ఉండొద్దని రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేడ్కర్ భావించారు. దళితులకు, గిరిజనులకే రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను కాంగ్రెస్ లెక్కచేయడం లేదు. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మతాధారంగా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రయతి్నంచింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి, మతం ఆధారంగా ఓ వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గట్టిగా వాదించింది. 2009, 2014 మేనిఫెస్టోల్లో ఇదే అంశాన్ని చేర్చింది’’
‘ఇండియా’ వస్తే ఏడాదికో ప్రధాని
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుతీరితే ప్రతి ఏడాదికో ప్రధాని మారతారని మోదీ ఎద్దేవా చేశారు. నాయకత్వ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇండియా కూటమి ఈ ఫార్ములాను అమలు చేస్తుందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ఏడాదికో ప్రధాని మారితే ప్రపంచం దృష్టిలో మనం నవ్వులపాలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలన వస్తే ప్రజలకు ఒకటి కంటే ఎక్కువ కార్లు, మోటార్ సైకిళ్లు, ఇళ్లుంటే ప్రభుత్వపరమవుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment