![Lok Sabha elections: 4 men Died Amid Phase 2 voting in Kerala](/styles/webp/s3/filefield_paths/sun-heat_0.jpg.webp?itok=i6L9Ik1g)
లోక్‌సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. 13 రాష్ట్రాలలో 88 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళ 20, కర్ణాటక 14, రాజస్థాన్ 13 , ఉత్తర్ ప్రదేశ్ 8,మహారాష్ట్ర 8,మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, వెస్ట్ బెంగాల్ 3, ఛత్తీస్ ఘడ్ 3, జమ్మూకశ్మీర్ 1,మణిపూర్ 1,త్రిపుర 1 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మండే ఎండను లెక్కచేయని ఓటర్లు క్యూలో నిల్చోని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళలో పోలింగ్ ప్రారంభమైన తర్వాత నలుగురు వ్యక్తులు కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో ముగ్గురు ఓటర్లు కాగా.. ఒకరు పోలింగ్ ఏజెంట్ ఉన్నారు.
పాలక్కాడ్‌లోని ఒట్టపాలెంలో 68 ఏళ్ల ఓటరు ఓటు వేసిన తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఒట్టపాలెంలో శుక్రవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. కోజికోడ్ టౌన్ బూత్ నంబర్ 16లో ఓ పార్టీ పోలింగ్ ఏజెంట్ అనీస్ అహ్మద్ (66) కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడు. కోజికోడ్‌లో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.
మలప్పురం జిల్లా తిరూర్‌లో,63 ఏళ్ల మదర్సా ఉపాధ్యాయుడు ఓటు వేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. శుక్రవారం తిరుర్‌లో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా అలప్పుజా జిల్లా అంబలప్పుజాలో 76 ఏళ్ల వృద్ధుడు ఓటేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మరణించాడు. అంబలప్పుజలో శుక్రవారం 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు రెండో విడత ముమ్మరంగా సాగుతోంది. 13 రాష్ట్రాలలో 88 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1గంటల వరకు సుమారు 35 శాతం పోలింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment