
భోపాల్: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ భిండ్‌లో 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో(కార్డియాక్ అరెస్ట్) ప్రాణాలు కోల్పోయాడు. ఇంత చిన్న వయసులో ఈ కారణంగా చనిపోయిన ఘటన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు వెల్లడించారు.
ఓ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలుడి పేరు మనీష్ జాతవ్. గురువారం మధ్యాహ్నం సోదరుడితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశాడు. అనంతరం 2:00 గంటలకు స్కూల్ బస్ ఎక్కాడు. క్షణాల్లోనే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు.
విద్యార్థిని గమనించిన బస్ డ్రైవర్ స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అప్రమత్తం చేశాడు.స్పృహకోల్పోయిన అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. బాలుడు అప్పటికే చనిపోయాడని వాళ్లు ప్రకటించారు.
ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని చెప్పారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు.
చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment