భోపాల్: మధ్యప్రదేశ్‌లో సోమవారం మంత్రివర్గ మినీ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రభుత్వంలో ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్ నివాస్ రావత్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అయితే తొలుత రామ్ నివాస్ తప్పుగా ప్రమాణం చేశారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉండగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం తన తప్పును గ్రహించడంతో 15 నిమిషాల తరువాత కేబినెట్ మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది.
రావత్ గ్వాలియర్-చంబల్ ప్రాంతానికి చెందిన శక్తివంతమైన ఓబీసీ నేత. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు. షియోపూర్ జిల్లాలోని విజయ్‌పూర్ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రావత్‌కు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవి, ప్రతిపక్ష నేత వంటి కీలక పదవులు అప్పజెప్పనందుకు అసంతృప్తి చెంది పార్టీ మారారు.
రావత్ బీజేపీలో చేరిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ మోరెనా సీటు గెలవడంలో కృషి చేశారు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా కుటుంబానికి విధేయుడిగా ఉన్న రావత్.. 2020 మార్చిలో 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి సింధియా పార్టీని వీడి బీజేపీలో చేరిప్పటికీ రావత్ కాంగ్రెస్‌లోనే కొనసాగారు.
ప్రస్తుతం సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మినహా 30 మంది మంత్రులు ఉన్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు, 18 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అంతేగాక అతని ప్రభుత్వంలో 3 ఖాళీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment