
భోపాల్ : భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. బహిరంగ ప్రదేశాలలో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేశాయి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో రాత్రి కర్ఫ్యూ విధించాయి. ఇక కరోనా నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బయటికి వచ్చిన వారిపై జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో ముఖానికి ఉన్న మాస్క్ సరిగా లేదన్న నెపంతో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై పోలీసులు చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఇండోర్‌కు చెందదిన కృష్ణ కేయర్(35) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన తండ్రి ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలుసుకొని ఆయన్ను కలవడానికి ఆటోలో బయలు దేరాడు. అయితే ఈ హడావిడిలో ముఖానికి పెట్టుకున్న మాస్కు కాస్త ముక్కు కిందకు జారింది. దీనిని గమనించిన ఇద్దరు పోలీసులు కృష్ణను ఆపి పోలీస్ స్టేషన్‌కు రావాలని డిమాండ్ చేశారు. దీనికి ఆటో డ్రైవర్ నిరాకరించడంతో పోలీసులు కృష్ణపై నడిరోడ్డుమీద దాడికి తెగబడ్డారు. అతన్ని నడిరోడ్డుపై కిందపడేసి కనికరం లేకుండా రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. కాళ్లతో తన్నారు.
కాగా పోలీసుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించగా వారు ఇంకా రెచ్చిపోయారు. ఆటోడ్రైవర్‌పై తమ ప్రతాపం చూపించారు. అతనితో వచ్చిన కొడుకు కూడా సాయం చేయాలని అక్కడి వాళ్లను కోరినా.. చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయారేగానీ ఎవరూ ముందుకు రాలేదు. ఈ తతంగాన్నంతా ఓ వ్యక్తి తన మొబైల్‌లో వీడియో తీశాడు. దాడి చేసిన పోలీసులను కమల్ ప్రజాపథ్, ధర్మేంద్ర జట్‌గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వారిద్దరిని సస్పెండ్ చేశారు. కాగా కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. గత 24 గంటల్లో 3,722 కొత్త కేసులు, 18 మరణాలు సంభవించాయి. మార్చి నుంచి, ఇప్పటి వరకు మాస్క్ ధరించని 1,61,000 మందికి జరిమానా విధించారు. వారి నుంచి మొత్తం 1.85 కోట్లు వసూలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment