భోపాల్: నిరసన వ్యక్తం చేస్తోన్న ఓ మహిళను కొందరు పోలీసులు జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై పోలీసుల స్పందన మాత్రం వింతగా ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని కత్నీ జిల్లా పరిధిలోని కౌరియా గ్రామంలోని ఓ మహిళ పొలంలో విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి పరిహారం అందలేదని మహిళ ఆరోపిస్తూ.. స్తంభం ఏర్పాటును వ్యతిరేకించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
కొందరు మహిళా పోలీసులు ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దాంతో పోలీసు శాఖ తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ వీడియోపై పోలీసు ఉన్నతాధికారి మనోజ్ కేడియా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆ మహిళ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందని, విద్యుత్ టవర్‌ను ఏర్పాటు చేస్తుండగా అడ్డుకుంటుందన్నారు. అందుకే ఆమెను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మహిళను పోలీసులు కొట్టారని ఆ అధికారి ఖండించారు. మహిళా పోలీసులు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని అధికారి తెలిపారు.
పోలీసుల చర్యపై ఫిర్యాదు చేసేందుకు మహిళ, ఆమె న్యాయవాది కలెక్టరేట్‌కు, జిల్లా పోలీసు చీఫ్ కార్యాలయానికి చేరుకున్నారు. విద్యుత్ సంస్థ, రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది ద్వారా కాంట్రాక్టర్లు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆ మహిళ ఆరోపించింది. బాధిత మహిళ లాయర్ ఆమెపై పోలీసుల చర్యను తప్పుపట్టారు. ఆమె ఫిర్యాదును ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. సంబంధిత అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment