దురదృష్టం భర్తల కోసం గృహహింస చట్టం లేదు: హైకోర్టు | Madras HC Over Domestic Violence Act for Husband To Proceed Against Wife | Sakshi
Sakshi News home page

దురదృష్టం భర్తల కోసం గృహహింస చట్టం లేదు: హైకోర్టు

Published Wed, Jun 2 2021 5:33 PM | Last Updated on Wed, Jun 2 2021 8:22 PM

Madras HC Over Domestic Violence Act for Husband To Proceed Against Wife - Sakshi

చెన్నై: మహిళల కోసం గృహ హింస చట్టం తీసుకొచ్చినప్పటికి ఆడవారిపై వేధింపులు ఆగడం లేదు. అయితే ఇక్కడ విచారకర అంశం ఏంటంటే బాధితుల కోసం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ విడాకులు రావడానికి 4 రోజుల ముందు భర్త తనపై గృహహింసకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 

ఫలితంగా అధికారులు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటీషన్‌ విచారణ సమయంలో మద్రాస్‌ హైకోర్టు దురదృష‍్టం కొద్ది భర్తలను వేధించే భార్యలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి గృహహింస చట్టం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాక సస్పెండైన అధికారిని తిరిగి డ్యూటీలో నియమించాల్సిందిగా ఆదేశించింది. 

కేసు వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. పి.శశికుమార్ అనే డాక్టర్ చెన్నైలో పశు సంవర్థక శాఖలో డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఈక్రమంలో శశికుమార్‌ భార్య అతడిపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టి.. ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసింది. ఆ తరువాత కూడా డాక్టర్ భార్య అతన్ని పలు రకాలుగా మాటలతో హింసించింది. భార్య చేతిలో నరకం చూసిన డాక్టర్ ఇక భరించలేనంటూ ఆమెను వదలి దూరంగా పారిపోయాడు. 2015లో విడాకులకు అప్లై చేస్తే.. 2020 ఈ కేసు విచారణ పూర్తి అయ్యింది. మరో నాలుగు రోజుల్లో విడాకులు మంజూరు అయ్యేవి.

డాక్టర్‌ భార్య క్రూరత్వం...
శశికుమార్‌ను ఇంకా ఇబ్బందులకు గురి చేయాలని భావించిన అతడి భార్య విడాకుల పిటిషన్ తీర్పుకు నాలుగు రోజుల ముందు, కోర్టులో కొనసాగుతున్న గృహ హింస ఫిర్యాదుకు సంబంధించి పశుసంవర్ధక, పశువైద్య సేవల డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దాంతో ఉన్నతాధికారులు, 2020 ఫిబ్రవరి 18 న శశికుమార్‌ను ఉద్యోగం నుంచి నుంచి సస్పెండ్ చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ మరుసటి రోజే అనగా 2020 ఫిబ్రవరి 19 న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. భార్య కావాలనే తనను ఇబ్బంది పెట్టడానికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని తెలుసుకున్న శశికుమార్‌ హైకోర్టును ఆశ్రయించాడు. 

కోర్టు ఏమన్నదంటే...
ఈ సందర్భంగా కేసు విచారిస్తున్న క్రమంలో హైకోర్టు జస్టిస్ వైద్యనాథన్.. ‘‘ఈ కేసు ఎలా కనిపిస్తోందంటే.. విడాకులు వచ్చాక భర్తను హింసించడం కుదరదని.. ఆలోపే అతడిని మరింతగా ఇబ్బంది పెట్టాలని ఆమె గృహ హింస కేసు పెట్టినట్లు కనిపిస్తోందని’’ అన్నారు. వివాహ బందం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పెళ్లి బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ప్రతీ భార్యా భర్తలకు ఉంది. అహం,అసహనం అనేవి… మనం ధరించే చెప్పుల లాంటివి. వాటిని ఇంటి బయటే వదిలేయాలి తప్ప లోపలికి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే… భార్యాభర్తలతోపాటు వారి పిల్లల భవిష్యత్తు కూడా నాశనమయ్యే అవకాశముంది కాబట్టి సమన్వయం అనేది ఇద్దరికీ అవసరమని’’ సూచించారు. 

కాగా.. 2015లో సాలెం ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకోగా ఫిబ్రవరి 2020లో విడాకులకు అనుమతిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని లెక్కలోకి తీసుకున్న హైకోర్టు ఆయన్ని శాఖ నుంచి సస్పెండ్ చెయ్యాల్సిన పనిలేదనీ… మరో 15 రోజుల్లో తిరిగి ఉద్యోగంలో చేర్చాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసు ఆధారంగా పోలీసులు డాక్టర్ శశికుమార్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో అయన శాఖాపరంగా సస్పెండ్ అయ్యారని జస్టిస్ వైద్యనాథన్ ఈ సందర్భంగా తెలిపారు.

చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement