‘చెన్నై’కు మైసూర్‌ శిలాఫలకాలు | Madras High Court Orders Government To Shift Mysore Petroglyphs To Chennai | Sakshi
Sakshi News home page

‘చెన్నై’కు మైసూర్‌ శిలాఫలకాలు

Published Fri, Aug 20 2021 8:51 AM | Last Updated on Fri, Aug 20 2021 8:51 AM

Madras High Court Orders Government To Shift Mysore Petroglyphs To Chennai - Sakshi

సాక్షి, చెన్నై: మైసూరులో ఉన్న తమిళ శిలాఫలకాల్ని, పురాతన శాసనాలను, వస్తువులను చెన్నైకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని పురవాస్తు విభాగం కేంద్రంలో తమిళనాడుకు సంబంధించిన 65 వేల మేరకు శిలాఫలాలకు, శాసనాలకు సంబంధించిన ఫలకాలు, పురాతన వస్తువులు ఉన్నట్టుగా మధురై ధర్మాసనంలో మదురై గోమతిపురానికి చెందిన న్యాయవాది మణి మారన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై  విచారణ గత వారం ముగిసింది. గురువారం న్యాయమూర్తులు కృపాకరన్, దురై స్వామి బెంచ్‌ తీర్పు వెలువరించింది. రెండు రాష్ట్రాల మధ్య కావేరి వివాదం సాగుతున్న నేపథ్యంలో మైసూరులోని తమిళ శిలాఫలకాలు, వస్తువులకు ఏవిధంగా రక్షణ ఉంటుందని కోర్టు ప్రశ్నించింది. 

అందుకే మైసూరులో ఉన్న శిలాఫలకాల్ని చెన్నైలోని పురావస్తు విభాగానికి తీసుకు రావాల్సిందేనని ఆదేశించారు. అలాగే, చెన్నైలోని శిలాఫలకాల విభాగాన్ని తమిళనాడు విభాగంగా మార్చాలని, నిపుణుల్ని సిబ్బందిని నియమించాలన్నారు. ఆరు నెలల్లో ఈ ప్రక్రియను ముగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. కాగా, మదురై ఎంపీ వెంకటేషన్‌ దాఖలు చేసిన  మరో పిటిషన్‌ విచారణ సమయంలో న్యాయమూర్తులు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు కేంద్రం నుంచి హిందీలో సమాధానం ఇచ్చినట్టుగా వెంకటేషన్‌ ఆరోపించారు. కోర్టు స్పందిస్తూ, రాష్ట్రం ఏ భాషలో అయితే, విజ్ఞప్తిని లేదా లేఖను పంపించిందో.. ఆ భాషలోనే సమాధానం ఇవ్వా లని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.    

ముకుతాడుకు ప్రత్యామ్నాయం ఆలోచించండి 
ఆవులు, ఎద్దులకు ముకుతాడు వేయడం వల్ల జీవాలు హింసకు గురవుతున్నాయని కోర్టులో గురువారం ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ బెంచ్‌ విచారణకు స్వీకరించింది. కాగా ముకుతాడు జీవాలను బాధించే విధంగా ఉందని, దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని కేంద్ర, రాష్ట్రాలకు సూచించారు. ఇక సీనియర్‌ న్యాయమూర్తి కృపాకరణ్‌ పదవీ విరమణ పొందారు. వీడ్కోలు సభలో కృపాకరణ్‌ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు శాఖ లు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, అప్పుడే సమ న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement