సాక్షి,ముంబై: మహారాష్ట్ర నూతన సీఎం ఏక్‍నాథ్ షిండే మంచి మనసు చాటుకున్నారు. థానేలో బుధవారం ఓ సమావేశంలో పాల్గొని తిరిగివెళ్తుండగా అక్కడే గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఆయన గమనించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో సిబ్బంది హుటాహుటిన ప్రత్యేక వాహనంలో కానిస్టేబుల్‌ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
థానే కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం షిండే. జులై 10న ఆషాడి ఏకాదశి సందర్భంగా విఠలుడిని ఆరాధించే వార్కీల ఏర్పాట్ల విషయంపై సమీక్ష నిర్వహించారు. ఆ రోజు పండరీపూర్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే వార్కీల వాహనాలకు టోల్ రుసుం తీసుకోవద్దని ఆదేశించారు. దీని కోసం వారు తమ వాహనాలకు స్టిక్కర్లు అంటించుకని స్థానిక పోలీసుల వద్ద నమోదు చేసుకుంటే సరిపోతుందన్నారు.
ఈ సమావేశం అనంతరం షిండే కార్యాలయాన్ని వీడుతుండగా.. ఆయనను చూసేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఆ సమూహంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆమెను చూసిన షిండే.. కాసేపు ఆగి ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీ మద్దతుతో షిండే సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment