మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా : కన్నెత్తి చూడని బాలీవుడ్‌ సెలబ్రిటీలు | Maharashtra Election Campaigning in Full Swing : No Bollywood Celebrities | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా : కన్నెత్తి చూడని బాలీవుడ్‌ సెలబ్రిటీలు

Published Tue, Nov 12 2024 1:04 PM | Last Updated on Tue, Nov 12 2024 2:22 PM

Maharashtra Election Campaigning in Full Swing : No Bollywood Celebrities

సమీపిస్తున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో ముగియనున్న ప్రచార గడువు 

గత ఎన్నికల్లో యాక్టివ్‌గా  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలీవుడ్‌ సెలబ్రిటీలు 

సల్మాన్‌ నివాసంపై కాల్పులు, బాబా సిద్దిఖీ హత్యోదంతాలతో ఇప్పటికే తీవ్ర భయాందోళనల్లో అగ్రనటులు, ఆర్టిస్టులు  

వీటికి తోడు బిష్టోయ్‌ గ్యాంగ్‌ బెదిరింపు కాల్స్‌తో సభలు, రోడ్‌షోల్లో పాల్గొనేందుకు వెనుకంజ  

స్టార్లు లేకుండానే ప్రచారం  నిర్వహిస్తున్న రాజకీయ పార్టీలు

సాక్షి ముంబై: ఎన్నికల ప్రచారంలో సినీతారలకు ప్రజల్లో ఉన్న క్రేజే వేరు. పంచ్‌ డైలాగులు, హావభావాలతో రోడ్‌ షోలు, ఎన్నికల సభలను రక్తికట్టించడంలో వారికి వారే సాటి. అందుకే ఓటర్లను ఆకర్షించేందుకు ఓ మాదిరి ఆర్టిస్టుల దగ్గర్నుంచి బడా నటీనటుల వరకూ రాజకీయ పార్టీలు తమ తరపున ప్రచారం చేయమంటూ ఆహ్వానించడం పరిపాటి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నప్పటికీ పలువురు సినీ, బాలీవుడ్‌ సెలబ్రిటీలు మాత్రం ఈవైపు కన్నెత్తి చూడడం లేదు.  

క్యాంపెయినింగ్‌కు దూరంగా బాలీవుడ్‌.. 
గతంలో ప్రముఖ రాజకీయ పార్టీల తరపున విస్తృతంగా ప్రచారం చేసిన అనేక మంది బాలీవుడ్‌ తారలు ఇప్పుడు ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. కొందరు మినహా అనేక మంది సినీ ప్రముఖులు ప్రచార సభలు, రోడ్‌షోలకు దూరంగా ఉంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై ఇటీవల కాల్పులు జరగటం, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బిష్ణోయి గ్యాంగ్‌ హత్య చేయడం, సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ ఖాన్‌లకు కూడా ఈ గ్యాంగ్‌ ద్వారా బెదిరింపు ఫోన్లు రావడం వల్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖ బాలీవుడ్‌ తారలతోపాటు చిన్న చిన్న పాత్రలు పోషించే ఆర్టిస్టులు కూడా మనకెందుకొచ్చిన గొడవలే అన్నట్లుగా మిన్నకుంటున్నారు. ఒకవేళ ఎవరైన బడా నేతలు ప్రచారానికి రావాలని అడిగినా షూటింగుల్లో బిజీగా ఉన్నామని, విదేశాల్లో ఉన్నామని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఓటర్లను ఆకట్టుకునేందుకే... 
లోక్‌సభ, అసెంబ్లీ, కార్పొరేషన్‌ ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చనా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పారీ్టలు అనేక విధాలుగా ప్రయత్నిస్తాయి. అందులో ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బాలీవుడ్‌ తారలను ప్రచారంలోకి దింపడం ఒక ఫ్యాషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి సభలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని, వీరి మాటల ప్రభావంతో ఓటర్లు తమ పార్టీ అభ్యరి్ధకి ఓటు వేస్తారని నేతల ప్రగాఢ నమ్మకం. మాజీ మంత్రి, ఇటీవలే హత్యకు గురైన బాబా సిద్దీఖీ తరపున గతంలో అనేక మంది ప్రముఖ బాలీవుడ్‌ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో సిద్దిఖీ నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలలో సల్మాన్‌ ఖాన్, షారుఖ్‌ ఖాన్‌ లాంటి అనేక మంది దిగ్గజ సెలిబ్రిటీలు కనిపించేవారు. ఆయన విజయంలో ఇది కూడా పరిగణించదగ్గ అంశమని రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ ఇటీవల ఆయన హత్యకు గురికావడంతో బాలీవుడ్‌ తారల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ హత్య తామే చేసినట్లు బిష్నోయి గ్యాంగ్‌ అంగీకరించడంతో పాటు పలువురు సెలబ్రిటీలకు ఈ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు రావడంతో ప్రచార సభలకు సా««ధ్యమైనంత దూరంగా ఉండాలని వారంతా భావిస్తున్నారు.  

ప్రాంతీయ నటులతో ప్రచారం... 
గతంలో మాదిరిగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక మంది సినీ తారలను స్టార్‌ క్యాంపెయినర్లుగా నియమించినప్పటికీ ఈసారి వారంతా ముఖం చాటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా ప్రచార సభలకు హాజరయ్యేందుకు వారు నిరాకరిస్తుండటంతో రాజకీయ పారీ్టలు గత్యంతరం లేక ప్రాంతీయ సినిమా, స్టేజీ ఆరి్టస్టులను ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో మరాఠీ సినీ, నాటక రంగానికి చెందిన తారలకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని గంటల ప్రచారానికి కొంతమంది రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇక రోజంతా ప్రచారంలో పాల్గొనాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఏ గ్రేడ్‌ తారలైతే రూ.20–35 లక్షల వరకూ డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం. దీంతో మరోదారి లేక వారడిగినంత చెల్లించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాగా కొందరు మరాఠీ నటుల మాత్రం రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం... 
దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన, జరగనున్న ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఈసారి సోషల్‌ మీడియాదే అగ్రస్థానం. తాము చెప్పదలచుకున్న విషయాలను, వివరించదలచిన అంశాలను సూటిగా, స్పష్టంగా, నిమిషాల వ్యవధిలో ఓటర్లకు చేర్చడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం కావడంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్‌ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. బాలీవుడ్‌ తారలు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనక పోయినప్పటికీ వారి వాయిస్‌ రికార్డింగులు, వీడియోలను ఫేస్‌ బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్‌గా మారి తమకు భారీగా ఓట్లు దక్కే అవకాశముందని అభ్యర్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేకంగా...
ముంబై సహా మహారాష్ట్ర సరిహద్దులైన విదర్భ. మరఠ్వాడాలోని చంద్రాపూర్, నాందేడ్, బల్లార్పూర్‌తోపాటు నాసిక్, ముంబై. పుణే, సోలాపూర్‌ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల పరిధిలోని నియోజక వర్గాలలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నటీనటులతోపాటు తెలుగు నేతలను ప్రచార రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమకుమార్‌ రెడ్డి, సీతక్క, ఇతర కాంగ్రెస్‌ నేతలు మహావికాస్‌ ఆఘాడి, కాంగ్రెస్‌లకు మద్దతుగా ర్యాలీలు, రోడ్‌ షోల ద్వారా విస్తత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ, టీడీపల మధ్య పొత్తు కుదిర్చేందుకు పవన్‌ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలుండే నియోజక వర్గాలలో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది

  

నో స్టార్స్‌... ఓన్లీ క్యాంపెయినింగ్‌ క్యాంపెయిన్‌లో పాల్గొననున్న మరాఠీ తారలు వీరే ...

  • నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) (అజిత్‌ పవార్‌ వర్గం)–శాయాజీ శిందే, భావు కదం. 

  • శివసేన (ఏక్‌నాథ్‌ శిందే)–గోవిందా, శరద్‌ పోంక్షే. 

  • మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌)–ప్రజక్తా మాళీ, తేజస్వినీ పండిట్‌. 

  • ఎన్సీపీ (శరద్‌ పవార్‌ వర్గం)–అమోల్‌ కోల్హే. 

  • బీజేపీ–ప్రియా బేర్డే, నిశా పరుళేకర్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement