సాక్షి, ముంబై: కరోనా కేసులు అత్యంత భారీగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్ర సర్కారు సెమీ లాక్‌డౌన్ ప్రకటించింది. దాదాపు లాక్‌డౌన్ తరహాలో 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపింది. నిత్యావసరాలు, అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. కరోనాతో మరోసారి యుద్ధం మొదలైందని.. అయితే లాక్‌డౌన్ కాకుండా ‘బ్రేక్ ది చైన్’ పేరుతో ఆంక్షలను అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. కరోనా విలయ తాండవం చేస్తోందని.. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యంకాదని, అందుకే మరోసారి కఠిన ఆంక్షల అమలుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇందుకు అందరి సహకారం అవసరమని కోరారు. ఆంక్షలతో ఇబ్బందిపడే రంగాల వారికి, పేదలకు సాయం అందజేస్తామని ప్రకటించారు.
కేసులు భారీగా పెరిగిపోవడంతో..
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో సగం దాకా ఆ ఒక్క రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో పరిస్థితి అదుపు తప్పుతున్న పరిస్థితిలో మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తారన్న అంచనాలు వెలువడినా.. కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలుతో సెమీ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బుధవారం (14న) రాత్రి ఎనిమిది గంటల నుంచి ‘బ్రేక్ ది చైన్’ పేరుతో కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
సొంతూళ్లకు వెళ్లేందుకు మంగళవారం ముంబైలోని ఎల్‌టీటీ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వలసజీవులు
కరోనా వ్యాప్తి చైన్‌ను తెంచేందుకు మే ఒకటో తేదీ ఉదయం వరకు 15 రోజులపాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని స్పష్టం చేశారు. మినహాయింపు ఉన్నవి తప్ప అన్నిరకాల ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసేయాలని ప్రకటించారు. జనం గుమిగూడే అన్నిరకాల ఫంక్షన్లు, కార్యక్రమాలపై నిషేధం ఉంటుందని చెప్పారు. ప్రజారవాణా, లోకల్ రైలు సేవలు కొనసాగుతాయని.. కానీ అవి అత్యవసర సేవలు అందించే వారికి మాత్రమేనని స్పష్టం చేశారు. రాత్రి కర్ఫ్యూ పూర్తిస్థాయిలో ఉంటుందని.. పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అత్యవసర సేవల కోసం మాత్రం బయటికి రావొచ్చని సూచించారు. హోటళ్లు కొనసాగించవచ్చని.. అయితే పార్శిల్ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.
పేదలకు సాయం
‘బ్రేక్ ది చైన్’ ఆంక్షలతో ఇబ్బంది పడే పేదలను ఆదుకునేందుకు రూ.5,476 కోట్లతో ప్యాకేజీని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. పేదలు తిండి కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు.. రూ.10కి అందించే శివ భోజన్ ను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ లబి్ధదారులకు మూడు కిలోల చొప్పున గోధుమలు, రెండు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందిస్తామన్నారు. వివిధ పథకాల కింద వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, విడోలకు అందే పెన్షన్లకు సంబంధించి రెండు నెలల సొమ్మును అడ్వాన్స్‌గా ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే రిజిస్టర్డ్ కార్మికులకు, లైసెన్సుడ్ ఆటో డ్రైవర్లకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రిజిస్టర్డ్ వీధి వ్యాపారులకు రూ.2,500 చొప్పున అందజేస్తామన్నారు. పలు పథకాల కింద లబి్ధపొందే పేదలకు, ఆదివాసీలకు రూ.2 వేల చొప్పున ఆరి్థక సాయం చేస్తామని ప్రకటించారు.
ఆక్సిజన్‌కు తీవ్ర కొరత
గతేడాది కరోనా పరీక్షల కేంద్రాలు తక్కువగా ఉండేవని, ఇప్పుడు 523కి పెంచామని ఉద్ధవ్ థాకరే చెప్పారు. రోజూ 85 వేల నుంచి లక్షా 25 వేల వరకు టెస్టులు చేస్తున్నామని, కోవిడ్ సెంటర్లను కూడా నాలుగు వేలకు పెంచామని తెలిపారు. మహారాష్ట్రలో 1,200 టన్నుల ఆక్సిజన్ తయారవుతోందని, వినియోగం 950 టన్నుల వరకు పెరిగిందని వివరించారు. అయితే కరోనా రోగుల సంఖ్య భారీగా పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో సేవలకు, ఆక్సిజన్‌కు, రెమిడెసివిర్ ఔషధానికి కొరత ఏర్పడుతోందన్నారు. వెంటనే వైమానిక దళ విమానాల్లో ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని కేంద్రాన్ని కోరినట్టుతెలిపారు. నర్సులు, డాక్టర్లకు తీవ్ర కొరత ఉందని.. రిటైర్డ్ డాక్టర్లు, నర్సులు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఒక్కరోజే 60,212 కేసులు.. 281 మరణాలు
మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 60,212 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 35,19,208కి చేరింది. ఒక్కరోజే 281 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 58,526కు పెరిగింది. ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 16 వేలకుపైగా పాజిటివ్ కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 5.93 లక్షల మంది యాక్టివ్ పేషెంట్లు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మహారాష్ట్రలో 15 రోజుల పాటు సెమీ లాక్‌డౌన్
Published Wed, Apr 14 2021 4:06 AM | Last Updated on Wed, Apr 14 2021 11:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment