సాక్షి, ముంబై: కరోనా టీకా రెండో డోసు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న అనేకమందికి రెండో డోసు తీసుకోవడానికి ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. అయినప్పటికీ, అనేక మంది రెండో తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా సుమారు కోటి నుంచి కోటిన్నర వరకు డోసుల నిల్వలు అలాగే పడి ఉన్నాయి. టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ జనాలు ముందుకు రాకపోవడంపై అజిత్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అలాంటి వారిని గాలించి పట్టుకొని, వారిపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.
చదవండి: ('పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి.. వారు మీకు ఏం అన్యాయం చేశారు')
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ఈ ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో మొదటి డోసు తీసుకున్న వారికి రెండో డోసు కోసం 28 రోజుల గడువు ఇచ్చారు. ఆ తరువాత టీకాల కొరత ఏర్పడటంతో ఆ గడువును 84 రోజులకు పెంచారు. కానీ, గడువు ముగిసినప్పటికీ అనేకమంది రెండో డోసు తీసుకోవడం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపంలో తెరమీదకు వచ్చింది. రోజురోజుకు ఈ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ప్రజల్లో దడ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు రెండు డోసులు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, టీకాను నిర్లక్ష్యం చేస్తున్న వారి వల్ల ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించే ప్రమాదం లేకపోలేదు.
రెండో డోసు తీసుకోని వారిలో ముంబై, థానే, నాసిక్, పుణే లాంటి ప్రధాన నగరాల కంటే జిల్లాల్లోనే ఎక్కువమంది ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో రెండో డోసు తీసుకోకుండా బాధ్యతా రహితంగా ప్రవర్తించే వారిపై ఆంక్షలు విధించాలనే యోచనలో ఉన్నట్లు అజిత్ పవార్ తెలిపారు. దీంతో వారు భయపడి స్వచ్చందంగా రెండో డోసు వేసుకునేందుకు ముందుకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment