ఇంఫాల్: మే 3న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ శాంతిని నెలకొల్పేందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. మణిపూర్‌లో మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు కారణమైన వారిని వదలబోయేది లేదని అన్నారు. అలాగే విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు ఒక కమిటీని, ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి ఒక కమిటీని, శాంతిని నెలకొల్పేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజలకు ధైర్యం చెప్పి...
అమిత్ షా అల్లర్ల నేపథ్యంలో భయబ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పారు. చెప్పుడు మాటలను గానీ, ఎటువంటి వదంతులను గానీ నమ్మవద్దని అన్నారు. ఈ సందర్బంగా మెయితేయి, కుకీ వర్గాలవారు తొందరపడొద్దన్నారు. ప్రజాసంఘాల వారు కూడా సంయమనం పాటించాలని కోరారు.
డీజీపీ బదిలీ...
ప్రస్తుత డీజీపీ పి.దౌన్గల్‌ను హోంశాఖకు బదిలీ చేసి ఆయన స్థానంలో CRPF ఐజీగా వ్యవహరించిన త్రిపుర ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ సింగ్ ను నూతన డీజీపీగా నియమించారు. ఇక్కడ ఉన్న గిరిజన తెగలకు ఎటువంటి సంబంధం లేని తటస్థ వర్గానికి చెందిన వారిని డీజీపీగా నియమిస్తే శాంతిభద్రతలను తొందరగా అదుపులోకి తేవచ్చనే ఉద్దేశ్యంతోనే డీజీపీని బదిలీ చేశారు.
అల్లర్లకు కారణమైనవారిని వదిలే ప్రసక్తే లేదు...
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి కలిగిన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని వేసి అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారులను కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందన్నారు హోంమంత్రి. ఎవరి దగ్గరైనా ఆయుధాలు ఉన్నట్లయితే వారు వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలన్నారు.లేదంటే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు.
శాంతిని నెలకొల్పేందుకు కమిటీ...
అలాగే మణిపూర్ ప్రజల్లో భయాందోళనలను తొలగించి శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అనసూయ ఉయికే నేతృత్వంలో మరో కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మెయితేయి, కుకీ వర్గాల ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారన్నారు.
చదవండి: మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం
Comments
Please login to add a commentAdd a comment