
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి దాటాక రాజధాని ఇంఫాల్‌లో ఆందోళనకారులు ఓ మృతదేహాంతో ఉరేగింపుగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇంటివైపు వెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా.. వాళ్లను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి భద్రతా బలగాలు.
కాంగ్‌పోక్పీ జిల్లాలో గురువారం ఉదయం ఆందోళనకారుల్లోని ఓ వర్గం జరిపిన కాల్పుల్లో.. ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మర్చంట్ నేవీ ఆఫీసర్ కావడంతో ఆగ్రహావేశాలు తారాస్థాయికి చేరాయి. అతని మృతదేహాన్ని ఓ శవపేటికలో ఉంచి.. రాత్రిపూట ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబంద్ బజార్ సెంటర్‌కు తీసుకొచ్చారు. పూలతో నివాళులు ఘటించేందుకు భారీగా జనం చేరుకున్నారు. అయితే ఆ మృతదేహంతో సీఎం బీరెన్ సింగ్ ఇంటి వైపు శవయాత్రకు మహిళలు సిద్ధపడగా.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రోడ్డు మధ్యలో టైర్లను కాల్చి నిరసనలు వ్యక్తం చేశారు వాళ్లు. పరిస్థితి చేజారేలా కనిపించడంతో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారుల్ని చెదరగొట్టాయి. ఆపై మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుప్రతి మార్చురీకి తరలించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని బలగాలు ప్రకటించుకున్నాయి.
కాంగ్‌పోక్పి జిల్లా హరోథెల్ గ్రామంలో.. సాయుధ మూక కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించాడని, అనేక మంది గాయపడ్డారని సైన్యం అధికారికంగా ప్రకటించింది. పరిస్థితి అదుపు చేసేందుకు తాము రంగంలోకి దిగినట్లు తెలిపింది ఆర్మీ.
కుకీ పనే!
కుకి మిలిటెంట్ల కాల్పుల్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ వైఖోం నీలకమల్ మృతి చెందానంటూ ఆరోపిస్తోంది అవతలి వర్గం. అదే సమయంలో లీమాఖోంగ్-హరోథెల్‌లో గురువారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా.. మరికొందరు గాయపడినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కల్లోల ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి భద్రతా బలగాలు.
ఇదీ చదవండి: మణిపూర్‌లో రాహుల్ గాంధీకి చేదు అనుభవం
Comments
Please login to add a commentAdd a comment