వీడిన ఉత్కంఠ: మావోయిస్టుల నుంచి రాకేశ్వర్‌ విడుదల | Maoists Released CoBRA Commando Rakeshwar Singh | Sakshi
Sakshi News home page

వీడిన ఉత్కంఠ: మావోయిస్టుల నుంచి రాకేశ్వర్‌ విడుదల

Published Thu, Apr 8 2021 4:29 PM | Last Updated on Fri, Apr 9 2021 2:30 AM

Maoists Released CoBRA Commando Rakeshwar Singh - Sakshi

రాకేశ్వర్‌ను బైక్‌పై తీసుకొస్తున్న జర్నలిస్టులు.. 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ దండకారణ్యంలో తమ వద్ద బందీగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ (కోబ్రా) జవాను రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాన్‌ను మావోయిస్టులు గురువారం విడుదల చేశారు. ఈ మేరకు బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల 3న బీజాపూర్‌ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎదురుకాల్పులు జరిగిన సమయంలో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చారు. ఇదే క్రమంలో కోబ్రా 210 బెటాలియన్‌కు చెందిన రాకేశ్వర్‌ సింగ్‌ను తమ బందీగా పట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా జవాన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం మధ్యవర్తులను పంపించాలని మావోయిస్టు పార్టీ కోరిన నేపథ్యంలో.. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ ధర్మపాల్‌ షైనీ, గోండ్వానా సమాజ్‌ అధ్యక్షుడు తెల్లం బోరయ్యలను మధ్యవర్తులుగా పంపించింది. వీరితోపాటు బస్తర్‌కు చెందిన గణేష్‌ మిశ్రా, రంజన్‌దాస్, ముఖేష్‌ చంద్రాకర్, యుగేష్‌ చంద్రాకర్, చేతన్‌ కుకేరియా, శంకర్, రవి అనే మరో ఏడుగురు జర్నలిస్టుల బృందం కూడా దండకారణ్యంలోకి వెళ్లింది.

భారీ ప్రజా కోర్టు 
జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ స్థాయిలో ప్రజాకోర్టు ఏర్పాటు చేశారు. వారి సమక్షంలోనే రాకేశ్వర్‌ సింగ్‌ను తాళ్లు విప్పి విడుదల చేశారు. మధ్యవర్తులకు అతన్ని అప్పగించారు. వారు రాకేశ్వర్‌ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నేరుగా బాసగూడ సీఆర్‌పీఎఫ్‌ క్యాంపునకు తీసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌లో బీజాపూర్‌ ఆస్పత్రికి తరలించగా,  అతనికి పరీక్షలు చేశారు. కాగా మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. 

కుటుంబసభ్యుల హర్షం 
జమ్మూకశ్మీర్‌కు చెందిన రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల పట్ల అతని భార్య మీనూ, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మీనూ మాట్లాడుతూ.. తన భర్త మావోల వద్ద బందీగా ఉన్న సమయంలో చాలా భయమేసిందన్నారు. వారు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు.  

కేంద్ర హోం మంత్రి ఫోన్‌ 
మావోయిస్టుల చెర నుంచి విడుదలైన రాకేశ్వర్‌ సింగ్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడినట్లు ఆ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. సింగ్‌ యోగక్షేమాలను అమిత్‌ షా అడిగి తెలుసుకున్నారని తెలిపాయి. 


చదవండి: రాకేశ్వర్‌ను విడిచిపెడతాం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement