రాకేశ్వర్‌సింగ్‌ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..?  | Chhattisgarh attack: Five Days Later, Maoists Free CRPF Commando | Sakshi
Sakshi News home page

రాకేశ్వర్‌సింగ్‌ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..? 

Published Fri, Apr 9 2021 2:17 AM | Last Updated on Fri, Apr 9 2021 1:58 PM

Chhattisgarh attack: Five Days Later, Maoists Free CRPF Commando - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఏప్రిల్‌ 3వ తేదీన మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడి చేసి కిడ్నాప్‌ చేసిన జవాను రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల చేశారు. రాకేశ్వర్‌సింగ్‌ను కిడ్నాప్‌చేసి 6 రోజుల పాటు తమ చెరలో ఉంచుకున్న మావోయిస్టులు మొదటి నుంచి అతనిపై సానుకూల ధోరణితోనే వ్యవహరించారు. అతని ప్రాణానికి ఎలాంటి హామీ తలపెట్టబోమని, ప్రభుత్వం వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభించాలని, మధ్యవర్తిత్వం వహించే వారి పేర్లు ప్రకటిస్తే రాకేశ్వర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఒక పాకలో ఏ విధమైన ఆందోళన లేకుండా కూర్చుని ఉన్న రాకేశ్వర్‌సింగ్‌ చిత్రాన్ని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇంతలోనే అనూహ్యంగా గురువారం మధ్యాహ్నమే రాకేశ్వర్‌సింగ్‌ను మావోలు విడుదల చేసినట్టుగా బస్తర్‌ ఐజీ ప్రకటించడం అం దరినీ విస్మయానికి గురిచేసింది. రాకేశ్వర్‌ సింగ్‌ కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. 

ఎలా విడుదల చేశారు? 
రాకేశ్వర్‌ను బందీగా పట్టుకుని చర్చలకు రావాలని ప్రభుత్వానికి డిమాండ్లు విధించిన మావోయిస్టులు అకస్మాత్తుగా అతన్ని విడుదల చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఛత్తీస్‌గఢ్‌ పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేశాయన్నది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులు ప్రభుత్వాధికారులను అపహరించడం, తమ డిమాండ్లు, నెరవేర్చుకోవడం, తమవారిని విడిపించుకోవడం కొత్త విషయమేమీ కాదు.. దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఇప్పుడు కూడా పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన 150 మంది అమాయక గిరిజనులను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేశారు. అదే విధంగా మావోల ఏరివేత కోసం కేంద్రం చేపట్టిన ‘‘ఆపరేషన్‌ ప్రహార్‌’’ను నిలిపివేయాలని కూడా డిమాండ్‌ చేశారు. అయితే ప్రస్తుతం మావోయిస్టులు పైకి చెబుతున్నట్టుగానే ఎలాంటి డిమాండ్లు, షరతులు లేకుండానే జవానును వదిలేశారా? లేక తెరవెనుక ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి ఏమైనా హామీలు లభించాయా? లావాదేవీలు నడిచాయా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.  


రాకేశ్వర్‌ విడుదలతో కుటుంబ సభ్యుల ఆనందోత్సాహం.. 

కూంబింగ్‌ నిలిపివేతకు ఇటాలియన్ల కిడ్నాప్‌ 
2012 మార్చి14న కోరాపూట్‌లో ఎమ్మెల్యే జినా హికాకాతో పాటు ఇద్దరు ఇటాలియన్‌ టూరిస్టులు క్లాంజియో కొలాంటిడియో, బసుస్కో పౌలోను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. దీంతో సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరిపింది. మావోయిస్టుల కోసం ఒరిస్సా అడవుల్లో జరుగుతున్న కూంబింగ్‌ను వెంటనే ఆపేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించడంతో మావోలు ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు ఇటాలియన్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదల చేశారు. అయితే దాని వెనుకా వేరే కారణం ఉందన్న ప్రచారం జరిగింది. 

ఒకేసారి ఏడుగురు ఐఏఎస్‌ అధికారులను..! 
1987లో తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఏడుగురు ఐఏఎస్‌ అధికారులను మావోలు కిడ్నాప్‌ చేయడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఐఏఎస్‌లను బందీలుగా చేసుకుని మావోలు అప్పట్లో వారి డిమాండ్లు నెరవేర్చుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.  ఈ నేపథ్యంలోనే రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రహార్‌ నిలిపివేతకు, గిరిజనులకు హామీ లభించిందా? ఇతరత్రా అంశాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రాకేశ్వర్‌ సింగ్‌ సురక్షితంగా విడుదల కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.    

గతంలో ఆర్కే కోసం కలెక్టర్‌ కిడ్నాప్‌ 
2011 ఫిబ్రవరి 17. మల్కన్‌గిరి జిల్లా బడ పాడ గ్రామం. ఇది ఏపీ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కలెక్టర్‌ వినీల్‌ కృష్ణ, జేఈ పబిత్రా మోహన్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. దారికాచిన మావోలు వారిని కిడ్నాప్‌ చేసి చిత్రకొండ అడవుల్లో బంధించారు. ఏపీ నుంచి పలువురు పౌరహక్కుల నేతలు మధ్యవర్తిత్వం వహించి వారిని విడుదల చేయించారు. దీనికి ప్రతిగా ఒరిస్సా ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత నిలిపివేసి,  అరెస్టు చేసిన ఆదివాసీలను విడుదల చేసింది. ఇదంతా బయటికి కనిపించింది. కానీ అసలు విషయం ఏంటంటే.. మావో అగ్రనేత ఆర్కే అలియాస్‌ అక్కిరాజు హరగోపాల్‌ను ఓ రహస్య ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతన్ని అరెస్టు లేదా ఎన్‌కౌంటర్‌ చేస్తారన్న విషయం తెలుసుకున్న మావోయిస్టులు వెంటనే మల్కన్‌గిరి కలెక్టర్‌ను కిడ్నాప్‌ చేశారు. ఆర్కేను అరెస్టు చేయకుండా భద్రతా బలగాలు వెనక్కి వచ్చేయాలని షరతు విధించారు. విధిలేని పరిస్థితుల్లో భద్రతాదళాలు ఆర్కేను విడిచిపెట్టగా, మావోలు కలెక్టర్, జేఈలను విడుదల చేశారు. బయటి ప్రపంచానికి మాత్రం అదంతా గిరిజనుల విడుదల కోసం జరిగిన కిడ్నాప్‌గా ప్రచారం జరిగింది. 

చదవండి: (వీడిన ఉత్కంఠ: మావోయిస్టుల నుంచి రాకేశ్వర్‌ విడుదల)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement