ప్రతీకాత్మక చిత్రం
పట్నా: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించుకుంటారు. దీనికోసం బంధువులు, స్నేహితులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా వివాహ వేడుకను నిర్వహిస్తారు. అయితే, ఒక్కొసారి పెళ్లివేడుకలలో అనుకోకుండా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. బిహార్‌లో జరిగిన పెళ్లింట విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది.
పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా పరిధిలోని చరద్వాలి గ్రామానికి చెందిన చందేశ్వర్ కుమారుడు మనీష్ గిరికి, యోగాపట్టిలోని అమేథియా గ్రామానికి చెందిన చందా అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. గత సోమవారం (నవంబరు29)న ఆడపెళ్లివారింటికి.. మగ పెళ్లివారు ఊరేగింపుగా వచ్చారు. వధువు తరపువారు పెళ్లి ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు కారులో ఊరేగింపుగా బ్యాండ్ మేళంతో మండపానికి చేరుకున్నారు.
బంధువులు, స్నేహితులంతా పెళ్లి వేడుకను ఉల్లాసంగా చూస్తున్నారు. అందరి కళ్లు కొత్త జంటను ఆసక్తిగా చూస్తున్నారు. అందరు చూస్తుండగానే కారునుంచి దిగిన వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడివారు షాకింగ్‌కు గురయ్యారు. కళ్లు తిరిగి పడుంటారని అందరు భావించారు. వరుడి ముఖంపైన నీళ్లు చల్లారు. ఎంత సేపటికి వరుడు లేవకపోవడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
వరుడిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. కనీసం కాళ్ల పారాణి కూడా ఆరకముందే వరుడు చనిపోవడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన తెలిసి వధువు కూడా కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment