‘సీరం’లో అగ్ని ప్రమాదం | Massive fire accident at Serum Institute of India | Sakshi
Sakshi News home page

‘సీరం’లో అగ్ని ప్రమాదం

Published Fri, Jan 22 2021 2:15 AM | Last Updated on Fri, Jan 22 2021 2:51 AM

Massive fire accident at Serum Institute of India - Sakshi

భవనం నుంచి వెలువడుతున్న దట్టమైన పొగలు

పుణే: కోవిడ్‌–19 టీకా ‘కోవిషీల్డ్‌’తయారు చేస్తున్న పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది చనిపోయారు. అయితే, ఈ ప్రమాదంతో టీకా తయారీపై ఎటువంటి ప్రభావం ఉండబోదని సీరం యాజమాన్యం తెలిపింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌లోని నిర్మాణంలో ఉన్న ఒక భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. మంటలు, భారీగా పొగ కమ్ముకోవడంతో అందులో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బంది చనిపోయారు.

అగ్నిమాపక యంత్రాంగం రంగంలోకి దిగి భవనంలో ఉన్న మరో 9 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. రెండు గంటల్లో మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో  యంత్రాలకు గానీ, పరికరాలకు గానీ నష్టం వాటిల్ల లేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌లోని బీసీజీ టీకా యూనిట్‌లో ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. ఘటనకు విద్యుత్‌ వ్యవస్థలో లోపాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఇందులో ఎటువంటి కుట్ర కోణానికి అవకాశం లేదన్నారు.

ప్రాణనష్టంపై ప్రధాని విచారం
సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వెలిబుచ్చారు. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్‌లో ఆకాంక్షించారు. గత ఏడాది సీరం ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన ప్రధాని మోదీ..ఘటన జరిగిన భవనంలోని మొదటి అంతస్తులో టీకా తయారీపై సమీక్ష జరిపారని  సంస్థ వర్గాలు తెలిపాయి.

టీకా ఉత్పత్తికి ఢోకా లేదు
ప్రమాదం జరిగిన ఎస్‌ఈజెడ్‌–3 భవనం కోవిషీల్డ్‌ టీకా తయారవుతున్న మంజరి సముదాయానికి కిలోమీటర్‌ దూరంలో ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదార్‌ పూనావాలా తెలిపారు. ప్రమాదంతో కోవిషీల్డ్‌ టీకా తయారీపై ఎటువంటి ప్రభావం లేదని వివరించారు. ఘటనలో ప్రాణనష్టం జరగడంపై  విచారం వెలిబుచ్చారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం  అందజేస్తామన్నారు.  అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు కోవిషీల్డ్‌ ఉత్పత్తికి  ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయాలను సిద్ధంగా ఉంచినట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement