వయనాడ్‌: ఊళ్లను ఊడ్చేసిన కొండచరియలు.. 70 మంది మృతి | Massive Landslides Hit Kerala's Wayanad Telugu News Updates | Sakshi
Sakshi News home page

వయనాడ్‌: కొండచరియలు విరిగిపడి.. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య

Published Tue, Jul 30 2024 7:16 AM | Last Updated on Tue, Jul 30 2024 2:11 PM

Massive Landslides Hit Kerala's Wayanad Telugu News Updates

కేరళ వయనాడ్‌లో తీవ్ర విషాదం

కొండచరియలు విరిగిపడి పలువురి మృతి

మెప్పాడి రీజియన్‌లో అర్ధరాత్రి ఘటన

చిన్నారుల్లో మృతులు కూడా

వంద మందికి పైగా గల్లంతు

మట్టి దిబ్బల కింద చిక్కుకున్న పలువురు.. బయటకు తీస్తున్న సహాయక బృందాలు

ఊళ్లను ఊడ్చేసిన కొండచరియలు

200ల ఇళ్లకు పైగా ధ్వంసం.. 400 కుటుంబాలు చెల్లాచెదురు

వరదల్లో కొట్టకుపోయిన దుకాణాలు, వందల సంఖ్యలో వాహనాలు

రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌, స్థానిక సహాయక బృందాలు

చీకటి, భారీ వర్షం, వంతెనలు తెగిపోవడంతో సహాయక చర్యలకు విఘాతం

రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ దిగ్భ్రాంతి.. పీఎంవో ఎక్స్‌గ్రేషియా ప్రకటన

నష్ట తీవ్రతను ఇప్పుడే అంచనా వేయలేమన్న కేరళ ప్రభుత్వం

తిరువంతనపురం: కేరళ వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి విలయం.. పెను విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. మెప్పాడి రీజియన్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటాక కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 70 మృతదేహాల్ని సహాయక బృందాలు వెలికి తీయగా.. మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. సుమారు 1,200 శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

ప్రస్తుతం.. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు స్థానిక సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.  ఈ మధ్యాహ్నాం ఆర్మీ సైతం రంగంలోకి దిగింది.  ఇప్పటివరకు 400 మందిని రక్షించి.. రిలీఫ్‌ క్యాంప్‌లకు తరలించారు. 

ముందక్కై నుంచి ఎయిర్‌లిఫ్ట్‌
ముందక్కై గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన వాళ్లను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత క్యాంప్‌లకు తరలించనున్నట్లు ఎమ్మెల్యే సిద్ధిఖీ తెలిపారు. ‘‘ఎంత మంది ఆచూకీ లేకుండా పోయారు, ఎంత మంది చనిపోయారు అనేదానిపై ఇప్పుడే పూర్తి సమాచారం అందడం కష్టం. చాలా చోట్లకు కనెక్టివిటీ తెగిపోయింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కూడా అక్కడికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి  అని అన్నారాయన. 

యుద్ధ ప్రతిపాదికన వంతెనలు
కేరళ విలయం ధాటికి వయనాడ్‌లో వంతెనలు తెగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యలకూ విఘాతం ఏర్పడుతోంది. దీంతో.. యుద్ధ ప్రతిపాదికన వంతెనలు పునరుద్ధరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. హెలికాఫ్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగించాలని భావిస్తున్నప్పటికీ.. వాతావరణం అనుకూలించట్లేదని ఆమె చెప్పారు. 

వయనాడ్‌కు రాహుల్‌ గాంధీ
కాంగ్రెస్‌ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వయనాడ్‌కు వెళ్లనున్నారు. కొండ చరియలు ప్రాంతాలను సందర్శించనున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గం నుంచే ఆయన రెండుసార్లు ఎంపీగా నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం.. ఎక్స్‌ వేదికగా ఆయన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కూడా.

 

కేరళలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు బలమైన గాలులు తోడవ్వడం పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కొండచరియలు విరిగిపడడం, చెట్లు కూలిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. వయనాడ్‌, కోజికోడ్‌, మలప్పురం, కాసర్‌గఢ్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట​ ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి ఈ నాలుగు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. 

అయితే.. సోమవారం అర్ధరాత్రి దాటాక.. మెప్పాడి రీజియన్‌లోని మందకై ప్రాంతంలో మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి. 2గం. సమయంలో ఒకసారి, 4గం. సమయంలో మరోసారి, ఆపై అరగంటకు మరోసారి చరియలు విరిగిపడ్డట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడు చలియార్‌నది ఉప్పొంగడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. బురద నీరు, బండరాళ్లు, కూలిన చెట్లు చుట్టుముట్టేయడంతో జనం చిక్కుకుపోయారు. 

ఘటన సమాచారం అందుకోగా.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, అలాగే సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌కు చేరుకున్నాయి. అయితే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు కలిగాయి. దీంతో  ఉదయం నుంచి సహాయక చర్యల్ని ఉధృతం చేశారు. మట్టి దిబ్బల కింద వందలాది మంది(1200 మంది అని ఒక అంచనా) చిక్కకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వంతెనలు తెగిపోవడం, భారీ వర్షం పడుతుండడంతో సహయక చర్యలు కొనసాతున్నాయి. 

 Video Credits: TIMES NOW 

  Video Credits: TIMES NOW 

 

ఎటు చూసినా విధ్వంసమే..
మెప్పాడి ముండకైలో ప్రాంతంలో ఇప్పటి వరకు పదిహేనుకు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ముందక్కై, అట్టమల, నూల్‌పూజ, చురల్‌మల గ్రామాలు ఊడ్చిపెట్టుకుపోయాయి.  అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.వంతెన కూలిపోవటంతో అత్తమల, చురల్‌మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటు‍న్నారు. గతంలో.. 2018లో సంభవించిన విపత్తులో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

రంగంలోకి హెలికాఫ్టర్లు
సహాయక బృందాలు మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వాళ్లను వెలికి తీసి.. చికిత్స కోసం మెప్పాడిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తున్నాయి. ఇంకా చాలా మంది మట్టి చరియల కింద చిక్కుకున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 400 కుటుంబాలు ఈ ప్రమాదంలో ప్రభావితం అయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే విపత్తుపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రాలేమని రెవెన్యూ మంత్రి కె.రాజన్ అంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఎయిర్‌పోర్స్‌ మిగ్‌ 17 హెలికాఫ్టర్లు రంగంలోకి దించినట్లు తెలిపారాయన. 

 

 

 తక్షణ చర్యలకు ఆదేశం
ఘటన గురించి తెలియగానే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రుల బృందాన్ని మెప్పాడికి వెళ్లాలని ఆదేశించారు. తక్షణ బృందాలతో సహా ఏజెన్సీలు అన్నీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని, ఆ సహాయక చర్యలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకృతి విపత్తు నేపథ్యంలో 9656938689, 8086010833 నెంబర్లతో కంట్రోల్‌ రూపం ఏర్పాటు చేసినట్లు,  వైద్య బృందాలను అక్కడికి పంపించినట్లు ఆ ప్రకటన పేర్కొంది.

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. విపత్తుపై ఆరా
వయనాడ్‌ భారీ ప్రకృతి విపత్తుపై ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా ద్రౌపది ముర్ము తన సందేశం తెలియజేశారు. ఇక ప్రధాని మోదీ.. కేరళ సీఎం విజయన్‌కు ఫోన్‌ చేసి ఆయన మాట్లాడారు. కేంద్రం తరఫున అన్నివిధాలుగా సాయం అందిస్తామని ‍ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి సురేష్‌ గోపితోనూ ప్రధాని మాట్లాడారు. ఇంకోవైపు.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ మాట్లాడి బీజేపీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలని కోరినట్లు సమాచారం. వయనాడ్‌ కలెక్టర్‌, అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాలని కోరారు.

ఇక వయనాడ్‌ విపత్తు మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రధాని కార్యాలయం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రధాని రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయలు, అలాగే.. గాయపడ్డ వాళ్లకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఎక్స్‌ ఖాతాలో పీఎంవో ట్వీట్‌ చేసింది. అలాగే ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపింది. 

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement