ఐజ్వాల్ : మిజోరాం శాసనసభ్యుడు డాక్టర్ జెడ్ఆర్ థియామ్ సంగ (62) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రజాప్రతినిధిగానే గాకుండా, ఒక వైద్యుడిగా కూడా మెడలో స్టెత్ తో ఎపుడూ సిద్ధంగా ఉండే ఆయన మరోసారి డాక్టర్ అవతారమెత్తారు. ఛాంపై జిల్లాలోని భూకంపం సంభవించిన ప్రాంతాల పర్యటన సందర్భంగా ఒక గర్భిణీ ప్రాణాలను కాపాడిన వైనం ప్రశంసలందుకుంటోంది.
ఇటీవలి భూకంపాల నష్టాలను అంచనా వేయడంతోపాటు, కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని తన నియోజకవర్గం, ఛాంపై నార్త్‌ను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మారుమూల ఎన్‌గూర్ గ్రామానికి చెందిన లాల్‌మంగైహ్సంగి (38)కు పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. మరోవైపు ఆరోగ్య సమస్యల కారణంగా చంపై ఆసుపత్రి వైద్య అధికారి సెలవులో ఉన్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న గైనకాలజీ స్పెషలిస్టు అయిన ఎమ్మెల్యే వెంటనే ఒక వైద్యుడిగా రంగంలో దిగారు. అత్యవసరంగా సిజేరియన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. అవసరమైన వారికి సహాయం చేయడం, పేద ప్రజలకు సహాయం చేయడం తన ముఖ్యమైన కర్తవ్యంగా భావించానని థియామ్ సాంగ్ తెలిపారు. అందుకే తాను ఎమ్మెల్యేగా ఎన్నికైందని చెప్పారు. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐజాల్‌కు ప్రయాణించే స్థితిలో లేపోవడంతో తానే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ బాగానే ఉన్నారని చెప్పారు.
కాగా గతనెలలో భారతదేశం-మయన్మార్ సరిహద్దు కాపలా సిబ్బందికి వైద్యం సాయం అందించేందుకు వాగు దాటి 7 కిలోమీటర్లు నడిచి వార్తలో నిలిచారు. 2018 ఎన్నికలలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) టికెట్‌పై పోటీ చేసి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టిటి జోతన్‌సంగను ఓడించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment