బిడ్డ పోయి పుట్టెడు దుఖంలో ఉన్న ఆ తల్లిని ఓదార్చాల్సింది పోయి.. ఆ ప్రభుత్వాధికారిణి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాటి ఆడదానిగా ఆ తల్లి శోకాన్ని అర్థం చేసుకోలేకపోయిందని, అధికారం ఉందని ఎలా పడితే అలా వ్యవహరిస్తుందా? అని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.
ఉత్తర ప్రదేశ్ మోదీనగర్‌లో పదేళ్ల అనురాగ్ భరద్వాజ్ అనే కుర్రాడి మరణం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. బుధవారం ఎప్పటిలాగే తన స్కూల్ బస్సులో వెళ్తుండగా.. డ్రైవర్ నిర్లక్ష్యంగా బండి నడపడం, హఠాత్తుగా మలుపులు తిప్పడంతో.. అనురాగ్ తన తల బయట పెట్టి వాంతులు చేసుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్ మరోసారి మలుపులు తిప్పడంతో.. ఓ స్తంభానికి తల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
ఈ ఘటనలో డ్రైవర్, బస్సులో ఉన్న మరో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఫిట్‌నెస్ లేని బస్సును నడిపించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా.. అనురాగ్ తల్లిదండ్రులతో పాటు మరికొందరు పేరెంట్స్ ధర్నాకు దిగారు. అంతేకాదు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం మీద ఏప్రిల్ 1వ తేదీనే స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశామని, అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే తన కొడుకు బతికేవాడని రోదిస్తూ నినాదాలు చేసింది అనురాగ్ తల్లి నేహా. ఈ క్రమంలో.. మోదీనగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ శుభాంగి శుక్లా అక్కడికి వచ్చారు.
‘‘ఎందుకు అర్థం చేసుకోవట్లదమ్మా? చెప్తున్నాగా నోరు మూస్కో’’ అని నేహాను గద్దించింది శుభాంగి. ‘చనిపోయింది నీ కొడుకా? నా కొడుకు?’’ అంటూ ఏడుస్తూ బదులిచ్చింది నేహా భరద్వాజ్. దీంతో కోపోద్రిక్తురాలైన శుభాంగి.. ఎన్నిసార్లు చెప్పాలి. అర్థం చేసుకోవా? నేను అర్థం చేసుకున్నా.. నీ కొడుకు చచ్చాడు’’ అంటూ నోరు పారేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. స్కూల్‌యాజమాన్యంపై చర్యలతో పాటు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌ను తక్షణమే స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌ను పరిశీలించాలని ఆదేశించాడు. అయితే అధికారిణిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ తరుణంలో.. ఆమెపై వేటు వేయాలని పలువురు పేరెంట్స్ కోరుతున్నారు. అయితే ప్రమాదంలో కుర్రాడి తప్పే ఉందని, వాంతులు వస్తున్న విషయం బస్సులో ఉన్న టీచర్‌కు చెప్పకుండా తల బయటకు పెట్టాడని ఎస్డీఎం శుభాంగి శుక్లా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment