న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ తన నియోజకవర్గ పేదల ఆకలి తీర్చేందుకు కేవలం రూపాయికే భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. గతేడాది డిసెంబర్‌లో తొలి జన్ రసోయిని(ప్రజా భోజనశాల) తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్‌లో ప్రారంభిన ఆయన.. తాజాగా రెండవ జన్ రసోయిని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో ప్రారంభించారు. రూపాయికే భోజనం కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 50,000 మందికి భోజనం సమకూర్చామని ఆయన వెల్లడించారు.
తాజాగా ప్రారంభించిన క్యాంటిన్‌లో ఒకే సమయానికి యాభై మందికి పైగా భోజనం వడ్డించవచ్చని గంభీర్ తెలిపారు. గతంలో క్రికెట్ మైదానంలో, ప్రస్తుతం రాజకీయాల్లో దూకుడుగా ఉండే గంభీర్, ఇలాంటి మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రశంసనీయమని ఢిల్లీ బీజేపీ ఇంఛార్జ్ పాండా పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. డ్రామాలు, ధర్నాలు చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, పేదలకు చేతనైనంత సాయం చేసేందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని వెల్లడించారు. ఆహారం ప్రజల కనీస అవసరమని, దేశ రాజధానిలో రెండు పూటలా కడుపు నిండా ఆహారాన్ని కేవలం రూపాయికే అందించడం తనకు చాలా సంతృప్తిని కలిగిస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment