సాక్షి,ముంబై: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం సామాన్యులతో పాటు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలందిస్తున్న డాక్టర్లపై కూడా పడింది. మూడు వారాల్లోనే ఏకంగా 300 మందికి పైగా వైద్యులకు సోకింది. ఇప్పటికే రాష్ట్రంలో డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తుండటం, ఆపై వైద్యులు కూడా కరోనా బారిన పడి హోం క్వారంటైన్‌కే పరిమితమైపోవడంతో రాష్ట్రంలో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన వైద్యుల సంఖ్య 308కి చేరింది. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది రెసిడెన్స్ డాక్టర్లకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు, ఆస్పత్రుల సిబ్బందిలో కలకలం మొదలైంది.
ఒక్కరోజులోనే 30 మంది వైద్యులకు కరోనా
ఇదిలాఉండగా కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ముంబైకర్లకు వైద్య సేవలందిస్తోన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. గురువారం ఒక్క ముంబైలోనే 30 మంది డాక్టర్లు కోవిడ్ బారిన పడ్డారు. రెసిడెన్స్ డాక్టర్లలో కూడా కరోనా సోకుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఔట్ పేషంట్ (ఓపీ), అత్యవసరం మినహా సాధారణ సర్జరీ విభాగాలను దశల వారీగా మూసివేయాలని వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా, ఒమిక్రాన్ వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు, అలాగే తగినంత వైద్య సిబ్బంది విధుల్లోకి చేరే వరకు ఈ రెండు డిపార్టుమెంట్లు పూర్తి సామర్థ్యంతో పని చేయకూడదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా బీఎంసీ ఆస్పత్రుల సంచాలకుడు డా.రమేశ్ భార్మల్ ధృవీకరించారు.
భయపెడుతున్న గణాంకాలు
మొదటి, రెండో విడత కరోనా కాలంలో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు చెందిన సుమారు 6,900 మంది సిబ్బంది, అధికారులకు కరోనా సోకగా...అందులో 250పైగా సిబ్బంది, అధికారులు మృతి చెందారు. గతనెల 17 నుంచి ఇప్పటివరకు 172 మంది అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అదేవిధంగా అనేకమంది కార్పొరేటర్లకు కూడా కరోనా సోకింది. లాక్‌డౌన్ అమలుచేసిన నాటి నుంచి అంటే 2020 మార్చి 23వ తేదీ నుంచి ఇప్పటి వరకు బీఎంసీలో మొత్తం 7,038 మంది సిబ్బంది, అధికారులు కరో నా బారిన పడిన సంగతి తెలిసిందే. మూడో దఫా లో కరోనా బారిన పడిన వారిలో సీనియర్ స్థాయి అధికారులు, డిప్యూటీ కమిషనర్ స్థాయి నలుగురు అధికారులకు, ఆరోగ్య శాఖ, భద్రతా విభాగం, నాలుగో శ్రేణికి చెందిన కార్మికులున్నారు. వీరితో పాటు బీఎంసీ స్థాయి సమితి అధ్యక్షుడు యశ్వంత్ జాధవ్, మాజీమేయర్ విశ్వనాథ్ మహాడేశ్వర్‌సహా కొందరు కార్పొరేటర్లకు కరోనా సోకింది.
Comments
Please login to add a commentAdd a comment