సాక్షి, ముంబై: పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న వారికి కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఆంక్షలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. పెళ్లికి రావాలని ఆహ్వానించిన బంధువులను ఇప్పుడు రావద్దని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, ఖాళీ మైదానాల బుకింగ్ ఫుల్ అయ్యాయి. గత సంవత్సరం లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేసుకున్న అనేక వివాహాలు ఇప్పుడు జరిపించేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా అదుపులోకి వచ్చిందన్న భావనతో నిశ్చితార్ధాలు పూర్తిచేసుకుని లగ్న పత్రికలు కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, డెకరేషన్, క్యాటరింగ్, మంగళ వాయిద్యాలు, లౌడ్ స్పీకర్లు తదితరాలను బుకింగ్ చేసుకున్నారు.
దగ్గరి, దూరపు బంధువులకు, మిత్రులకు, పరిచయస్తులకు పత్రికలు పంపిణీ చేశారు. నగదు, కట్నకానుకలు సైతం సిద్ధం చేసుకున్నారు. పెళ్లికి హాజరయ్యేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులు రైల్వే, బస్ టికెట్లు సైతం బుకింగ్ చేసుకున్నారు. అయితే ఈలోపే కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పడగ విప్పడంతో కొత్త పేచీ మొదలైంది. ఒమిక్రాన్ ప్రభావం రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే ముంబైలోనే అధికంగా ఉంది. ఒమిక్రాన్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆంక్షలు విధించే పనిలో నిమగ్నమైంది. అందుకు జనాలు పెద్దసంఖ్యలో పోగయ్యే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను లక్ష్యంగా చేసుకుంది. పెళ్లి ఏసీ ఫంక్షన్ హాలులో జరిగితే వధూవరుల తరఫునుంచి కేవలం 50 మందిని మాత్రమే ఆహ్వానించాలని నిబంధన విధించింది. అంతేగాకుండా ఖాళీ మైదానంలో నిర్వహిస్తే మైదానం సామర్ధ్యాన్ని బట్టి 25 శాతం మించకుండా ఆహ్వానించాలని నిర్ధేశించింది.
ఇక్కడ చదవండి: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే..
నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు అమలు చేసేందుకు ప్రత్యేకంగా కొన్ని ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించింది. దీంతో ఏం చేయాలో తెలియక వధూవరుల కుటుంబసభ్యులు ఆందోళనలో పడిపోయారు. కేవలం దగ్గరి బంధువులు మినహా, ఆహ్వానించిన దూరపు బంధువులందరికీ, మిత్రులకు పెళ్లికి రావద్దని ఫోన్ చేసి చెబుతున్నారు. వివాహాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలతో క్యాటరింగ్ సర్వీసు యజమానులు ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపోయారు. వచ్చిన ఆర్డర్లన్నీ రద్దు కావడంతో మొదటికే మోసం వచ్చిందని క్యాటరింగ్ యజమానులు వాపోతున్నారు. 2022 జనవరిలో సంక్రాంతి పర్వదినం తరువాత కూడా అనేక ముహూర్తాలున్నప్పటికీ.. అప్పటికీ ఒమిక్రాన్ పరిస్ధితి అదుపు తప్పితే ఏకంగా శుభకార్యాలు రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే అనేక మంది నిశ్చితార్ధాలు పూర్తిచేసుకుని పెళ్లి పత్రికలు ముద్రించుకున్నారు. అకస్మాత్తుగా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో వారు ఇబ్బందుల్లో పడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment