సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో సామాన్యులను అనుమతించే సమయాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమ లులో ఉన్న సమయం సామాన్యులు, వ్యాపారులు, కార్మికులతోపాటు ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అనుకూలంగా లేదు. దీంతో మొదటి రోజు నుంచి సమయంలో మార్పులు చేయాలని అనేక ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న రాజేశ్ టోపే త్వరలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చర్చిస్తామని, ఆ తరువాత రైల్వే అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగులకు ఎక్కువ నష్టం..
లోకల్ రైళ్లలో సామాన్యులను అనుమతించడంతోపాటు వారు పడుతున్న ఇబ్బందులతోపాటు, వారికి ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత సోమవారం నుంచి నిర్ణీత సమయంలో సామాన్యులు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున (మొదటి రైలు బయలుదేరిన) నుంచి ఉదయం 7 గంటల లోపు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, ఆ తరువాత రాత్రి 9 తొమ్మిది గంటల నుంచి చివరి రైలు బయలుదేరే వరకు సామాన్యులకు అనుమతి కల్పిస్తున్నారు. కానీ, ఈ సమయం వివిధ పనుల నిమిత్తం బయటపడిన వారికి లేదా బంధువుల ఇళ్లకు కుటుంబ సభ్యులతో బయలుదేరిన వారికి మాత్రమే అనుకూలంగా ఉంది. కానీ, ప్రైవేటు, వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఏమాత్రం అనుకూలంగా లేదు.
దీంతో రైల్వే తీసుకున్న నిర్ణయంతో మొదటి నుంచి ఉద్యోగులు పెదవి విరిస్తున్నారు. లోకల్ రైళ్లకు బదులుగా బెస్ట్ లేదా ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరడమే ఉత్తమమని కొందరు భావిస్తున్నారు. దీంతో ముంబైకర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. మార్పులు చేయడానికి కుదురుతుందా..? ఆదరబాదరగా నిర్ణయం తీసుకుంటే కరోనా వైరస్ నియంత్రణపై గత పది నెలలుగా చేసిన ప్రయత్నాలన్ని వృథా కానున్నాయి. దీంతో సమయంలో మార్పులు చేసే ముందు భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment