Mumbaikars
-
ముంబై లోకల్ రైళ్ల సమయాల్లో మార్పు!
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో సామాన్యులను అనుమతించే సమయాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమ లులో ఉన్న సమయం సామాన్యులు, వ్యాపారులు, కార్మికులతోపాటు ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అనుకూలంగా లేదు. దీంతో మొదటి రోజు నుంచి సమయంలో మార్పులు చేయాలని అనేక ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న రాజేశ్ టోపే త్వరలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో చర్చిస్తామని, ఆ తరువాత రైల్వే అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఎక్కువ నష్టం.. లోకల్ రైళ్లలో సామాన్యులను అనుమతించడంతోపాటు వారు పడుతున్న ఇబ్బందులతోపాటు, వారికి ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత సోమవారం నుంచి నిర్ణీత సమయంలో సామాన్యులు లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున (మొదటి రైలు బయలుదేరిన) నుంచి ఉదయం 7 గంటల లోపు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, ఆ తరువాత రాత్రి 9 తొమ్మిది గంటల నుంచి చివరి రైలు బయలుదేరే వరకు సామాన్యులకు అనుమతి కల్పిస్తున్నారు. కానీ, ఈ సమయం వివిధ పనుల నిమిత్తం బయటపడిన వారికి లేదా బంధువుల ఇళ్లకు కుటుంబ సభ్యులతో బయలుదేరిన వారికి మాత్రమే అనుకూలంగా ఉంది. కానీ, ప్రైవేటు, వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఏమాత్రం అనుకూలంగా లేదు. దీంతో రైల్వే తీసుకున్న నిర్ణయంతో మొదటి నుంచి ఉద్యోగులు పెదవి విరిస్తున్నారు. లోకల్ రైళ్లకు బదులుగా బెస్ట్ లేదా ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరడమే ఉత్తమమని కొందరు భావిస్తున్నారు. దీంతో ముంబైకర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. మార్పులు చేయడానికి కుదురుతుందా..? ఆదరబాదరగా నిర్ణయం తీసుకుంటే కరోనా వైరస్ నియంత్రణపై గత పది నెలలుగా చేసిన ప్రయత్నాలన్ని వృథా కానున్నాయి. దీంతో సమయంలో మార్పులు చేసే ముందు భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: ‘మహా’లో కీలక మార్పు.. స్పీకర్ రాజీనామా త్వరలో ముంబై కరోనా రహితం! -
సన్నద్ధం
ఈ అమ్మాయిని చూడండి. ప్రెట్టీగా ఉంది కదా! కానీ పేరేమిటో తెలీదు. సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ‘పత్లీ చోక్రీ’ గాప్రశంసలు అందుకుంటోంది. çపత్లీ చోక్రీ అంటే ‘సన్నటి పిల్ల’ అని అర్థం. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ‘పత్లీ’గా లేదు. ఒకప్పుడు ఉండేది. అప్పుడు అందరూ తనపై ప్రశంసల పూలజల్లులు కురిపించారు. అయితే మరీ సన్నగా ఉండడం అనారోగ్యమే తప్ప అందంగా కాదని ఆమె గ్రహించింది. ఆ గ్రహింపును ఫేస్బుక్లో ఒక పోస్ట్‌గా పెట్టింది! సన్నబడాలని కోరుకునే టీనేజ్ ఆడపిల్లలకు పనికొచ్చే పోస్ట్ ఇది. అందుకే ఈ పోస్ట్‌కు ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ప్రముఖ సోషల్‌సైట్ ప్రాచుర్యం కల్పిస్తోంది. ఇంతకీ ఈ ‘పత్లీ చోక్రీ’ రాసిన పోస్ట్‌లో ఏముంది?! టీనేజ్ గర్ల్స్‌ని ఈమె దేనికి సన్నద్ధం చేస్తోంది? ‘‘నాకప్పుడు పందొమ్మిదేళ్లు. టైఫాయిడ్ జ్వరంతో మూడు వారాలపాటు మంచం పట్టాను. ఒక్కసారిగా పదకొండు కిలోల బరువు తగ్గిపోయాను. జ్వరం నుంచి కోలుకుని కాలేజ్‌కి వెళ్తున్నాను. స్నేహితులంతా ఆశ్చర్యంగా చూశారు నన్ను. ‘ఏయ్! ఏం చేశావ్’ అని సంభ్రమంగా అడిగారు కొందరు. ‘చేయడానికి ఏముంది?’ ఆ ప్రశ్న అర్థం కాలేదు మొదట్లో. ‘ఎంత స్లిమ్‌గా ఉన్నావో తెలుసా, ఏ జిమ్కెళ్లావు’ అంటూ ప్రశంసలతో కూడిన ప్రశ్నలు. నిజమా! అంత బాగున్నానా... నాకూ విచిత్రంగానే అనిపించింది. ‘టైఫాయిడ్ జ్వరం వచ్చింది’ అని నేను మాట పూర్తి చేసే లోపు వాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు. ‘ఎంత అదృష్టమో నీది’ అని! జిమ్‌కెళ్లి వర్కవుట్లు చేసే పనిలేకుండా బరువు తగ్గినందుకు ఒకటే పొగడ్తలు. నాలో కూడా ఆసక్తి మొగ్గతొడిగింది. అప్పుడు నా బరువు 41 కిలోలు. ఇక ఏ మాత్రం బరువు పెరగకూడదనుకున్నాను. రోజూ వాంతి చేసుకోవడమే. నిజమే! భోజనం చేయడం, బాత్రూమ్లోకి వెళ్లి గొంతులో వేళ్లు పోనిచ్చి తిన్నది వాంతి చేసుకోవడం నా డైలీ రొటీన్. పత్లీ చోక్రీ (సన్నటి అమ్మాయి) అని ఎవరైనా అంటుంటే తల మీద నాకేదో కిరీటం పెట్టినట్లుండేది. అలా రెండేళ్లు గడిచిపోయాయి. వందగ్రాములు కూడా బరువు పెరగకుండా మెయింటెయిన్ చేశాను ఆ రెండేళ్లలో. అప్పుడు తెలిసింది అదొక మానసిక సమస్య అని. బరువు పెరుగుతామనే భయంతో తిన్న అన్నాన్ని వాంతి చేసుకునే వ్యాధిని ‘బులీమియా’ అంటారని. అప్పుడు తొలిసారిగా నా ఆరోగ్యం గురించి బెంగ పట్టుకుంది. ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పాను. డాక్టర్‌కు చూపించారు నన్ను. అప్పటి నుంచి భోజనం చేసిన తరువాత నన్ను బాత్రూమ్లోకి వెళ్లనివ్వకుండా కాపు కాశారు ఇంట్లో వాళ్లంతా. నా వంతు ప్రయత్నంగా ఆహారం పరిమాణాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోయాను. నేను కోల్పోయిన బరువును తిరిగి పొందాను. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నా దేహాకృతిని ఉన్నదున్నట్లుగా స్వీకరించడం నేర్చుకున్నాను. సన్నదనం మీద నా వ్యామోహం ఇంకా కొనసాగి ఉంటే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యేవో తలుచుకుంటే భయమేస్తోంది’’.. అని 22 ఏళ్ల ముంబయి అమ్మాయి ఫేస్బుక్లో తన అనుభవాన్ని స్నేహితులతో పంచుకుంది. కౌన్సెలింగ్ కూడా ఇస్తోంది ఇప్పుడామె ‘బాడీ ఇమేజ్’ కారణంగా మానసిక ఆందోళన పడుతూ, డిప్రెషన్‌కు లోనయ్యే వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది. అమ్మాయిలకు ఆమె చేస్తున్న సూచన ఒక్కటే. ‘మనమేమీ సినిమాల్లో నటించడం లేదు, పత్రికల కవర్ పేజీకి పోజులివ్వడమూ లేదు. అలాంటప్పుడు దేహాకృతి నాజూకుగా ఉండాలనే కోరిక అర్థం లేనిది. బాడీ ఫిజిక్ కోసం గంటలు గంటలు సమయం కేటాయించాలంటే ఉద్యోగాలతో సాధ్యమయ్యే పని కాదు. స్థూలకాయంతో అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్త పడితే చాలు. బొద్దుగా ఉంటే ఆందోళన పడాల్సిన అవసరమే లేదు’ అని చెప్తోంది. ఆమె సోషల్ మీడియాలో చెప్పిన మంచిమాటలను ప్రధాన స్రవంతి మీడియా అందిపుచ్చుకుంది. కానీ ఆమె పేరు మాత్రం పత్లీ చోక్రీగానే ఉండిపోయింది. నవ్వులో నీరసం.. ఓ లక్షణం టీనేజ్ అమ్మాయిల్లో పాతికశాతం మంది ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. కొంతమంది సరిగా తినకుండా ‘అనెరొక్సియా నెర్వోజా’ బారిన పడుతుంటే, మరికొందరు తిన్న తర్వాత పావు గంట లోపే (అది జీర్ణమై శక్తిగా ఒంటికి పట్టే అవకాశం ఇవ్వకుండా) వాంతి చేసుకుంటూ ‘బులీమియా’ బారిన పడుతున్నారు. పలకరిస్తే నీరసంగా నవ్వడం, ఎక్కువ మాట్లాడే ఓపిక లేక పొడి పొడిగా మాట్లాడి సరిపెట్టుకోవడం, ఎక్కువ సేపు ఒక పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటివి వీళ్లలో కనిపించే లక్షణాలు. అందం అనేది సన్నగా ఉండడంలో ఉండదని, ఆరోగ్యంగా ఉండడంలోనే ఉంటుందని తెలియచెప్పడానికి ఇప్పుడు డాక్టర్లు, సైకాలజిస్టులు కూడా పత్లీ చోక్రీ కేసునే ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. – మంజీర -
విమానం ఎగిరితే చాలు హడలెత్తిపోతున్నారు!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటున్న పౌరులకు విమానాల రాకపోకలు హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏ విమానం వచ్చి కూలుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకు ప్రధాన కారణం ముంబైలో ఉన్న దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల రన్వేలు నిత్యం బిజీగా ఉండటమే. దీంతో సకాలంలో ల్యాండింగ్‌కు అవకాశం దొరక్క అనేక సందర్భాలలో విమానాలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోందని రవాణ శాఖ సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విమానంలో ఏదైన సాంకేతిక లోపం తలెత్తిన లేదా పక్షులు ఢీ కొడితే విమానం జనవాసాల మ«ధ్య కూలడం ఖాయం. జనవాసాల మధ్య చక్కర్లు.. 1978లో బాంద్రాలో ఎయిర్ ఇండియా విమానం–855, 1982లో ముంబైలో ఎయిర్ ఇండియా విమానం–403, అంతేకాకుండా 1993, ఏప్రిల్ 26న ఔరంగాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం, ఇటీవల ఘాట్కోపర్లో 12 సీట్ల సామర్థ్యమున్న చార్టర్డ్ విమానం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో చాలా మంది దుర్మరణం చెందారు. కాగా, గత పదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం విమానాశ్రయం ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. దీంతో ఒకవేళ విమానాలు కూలితే నష్టం ఊహించలేనంతగా ఉండే అవకాశం ఉంది. ఘాట్కోపర్లో అదృష్టవశాత్తు విమానం నిర్మాణంలో ఉన్న భవనంపై కూలడంతో ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు. ఈ తాజా ఘటనతో విమానాల రాకపోకల వల్ల ముంబైకర్లకు పెను ప్రమాదం పొంచి ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. రన్‌వేపై ఇప్పటికే చాలా విమానాలు ఉండటంతో ఇక ల్యాండిండ్ కావాల్సిన విమానాలు జనావాసాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. ఇంధనం ఖాళీ అయితే.. నగరంలో దేశీయ, అంతర్జాతీయ ఇలా రెండు విమానాశ్రయాలున్నాయి. ట్రాఫిక్ వల్ల విమానాశ్రయంలోని రన్ వే పై విపరీతమైన భారం పడుతోంది. దీంతో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ముంబైకి వచ్చే విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే విమానంలో అర గంటకు సరిపడా ఇంధనం అదనంగా నిల్వ ఉంటుంది. ముంబై జనవాసాల మీదుగా చక్కర్లు కొట్టే విమానంలో ఏదైన సాంకేతిక సమస్య తలెత్తితే లేదా రన్‌వే బిజీ కారణంగా ల్యాండింగ్‌కు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాగా, అదే సమయంలో ఇంధనం ట్యాంక్ ఖాళీ అయితే అప్పుడు పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకు వచ్చింది. నిబంధనల మేరకే.. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అథారిటీ నియమాల ప్రకారం విమానాశ్రయం నగరం బయట ఉండాలి. ఎదైనా ప్రమాదం జరిగితే ప్రాణ హాని ఎక్కువ శాతం జరగదని దీని వెనక ముఖ్యోద్దేశం. కానీ, నాలుగైదు దశాబ్ధాల కిందట ముంబైలో దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినప్పుడు చుట్టుపక్కల జనవాసాలు అంతగా లేవు. కాలక్రమేణా విమానాశ్రయం చుట్టూ నక్షత్రాల హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, మధ్య తరగతి, పేదలు ఇలా అనేక రకాల జనవాసాల బస్తీ పెరిగిపోయింది. ఫలితంగా విమానాశ్రయాలు నగరం నడిబొడ్డున ఉన్నట్లే ఉన్నాయి. మరోపక్క విమానాల రాకపోకలు పెరగడంతో ఇక్కడ పడుతున్న భారాన్ని తగ్గించేందుకు నవీముంబైలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఉందని విమానాశ్రయం వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందుకు స్థల సేకరణ పనులు పూర్తయ్యాయి. రన్‌వేకు అడ్డు వస్తున్న భారీ ఉలవే కొండను నేల మట్టంచేసే పనులు ఇదివరకే ప్రారంభమైన విషయం విదితమే. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నిర్మాణం కూడా అడవిలో జరుగుతోంది. కొన్ని దశాబ్ధాల తరువాత ఈ ప్రాంతంలో కూడా జనవాసాల బస్తీలు వెలుస్తాయని చెప్పడంలో సంశయం లేదు. అప్పుడూ ఇదే పరిస్థితి ఎదురుకావడం ఖాయం. రోజుకు 950 విమానాలు.. ముంబై విమానాశ్రయంలో రోజుకు 950 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. గంటకు 45 విమనాలు ల్యాండింగ్, టేకాప్ అవుతుంటాయి. విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న కుర్లా ప్రాంతంలో 1.20 లక్షల జనాలు, ఘాట్కోపర్, శాంతాకృజ్‌లో 90 వేల చొప్పున, విలేపార్లేలో 80 వేల మంది జనాలు ఉంటారు. విమానాశ్రయం పరిసరాల్లో కుర్లా, ఘాట్కోపర్లో చిన్న, చిన్న కొండలున్నాయి. కొండపై అనేక పేదల గుడిసెలున్నాయి. అవి రన్ వేకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇంటి పైకప్పు పై నిలబడి చేయి పైకెత్తితే విమానం తగులుతుందా అనే అనుమానం వస్తుంది. దీన్ని బట్టి ఆ గుడిసెలు విమానాశ్రయానికి ఎంత దగ్గరున్నాయో ఇట్టే అర్ధమవుతోంది. -
పనిమంతులు ముంబైవాసులు...!
అడుగు తీస్తే మరో అడుగు పెట్టేందుకు ఖాళీ లేక కిక్కిరిసిన లోకల్ ట్రైన్లు...స్టేషన్లలో రైళ్లు ఆగినపుడు ఎక్కడానికి, దిగడానికి ఒలంపిక్ పతకం కోసమా అన్నట్టుగా పోటీపడే జనం...లక్షలాది ఉద్యోగులకు సమయానికి మధ్యాహ్న భోజనం అందించేందుకు అహోరాత్రులు శ్రమించే డబ్బా వాలాలు...వాహనాలు, మనుషులు, ట్రాఫిక్‌తో నిండిపోయిన రహదారులు... రెండుకోట్లకు పైగా ప్రజల రంగురంగుల కలల ప్రపంచం... ముంబై...! అసలు అలుపనేదే లేని, నడిరాత్రి అయినా ఎక్కడ ఆగకుండా నిరంతరం పయనిస్తూ, రాత్రిపూట కూడా విశ్రాంతి అనే మాట కూడా ఎరగని మహానగరమిది. ఉద్యోగులు అత్యధికంగా కష్టించే నగరంగా దీనిని మార్చడంలోనూ అక్కడి ఉద్యోగులు పై చేయి సాధించారు. ఇప్పుడిక్కడి ఉద్యోగులు ప్రపంచంలోనే అత్యధిక గంటలు పనిచేస్తున్న వారిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని 77 ప్రధాన నగరాల్లో ఏడాదికి 3,314.7 గంటల పాటు పనిచేస్తున్న రికార్డ్‌తో ప్రథమస్థానంలో నిలిచారు. ఇది ప్రపంచ సగటు 1,987 గంటల కంటే ఎంతో ఎక్కువ. ముఖ్యమైన ఐరోపా నగరాలు... రోమ్–1,581, పారిస్–1,662 పనిగంటలతో పోల్చితే రెండు రెట్ల కంటే ఎక్కువే.. ముంబైలో సగటు ఉద్యోగి ఏడాదికి 3,314.7 గంటలు పనిచేస్తున్నట్లు తాజాగా స్విస్ బ్యాంక్ యూబీఎస్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 77 నగరాల్లో సగటున ఏడాదికి పనిచేసే గంటలతో పాటు వివిధ అంశాలపై జరిపిన పరిశీలనను ‘ప్రైస్ అండ్ ఎర్నింగ్స్ 2018 రిపోర్ట్’పేరిట విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్యలో ఈ నగరాల్లోని 75 వేలకు పైగా డేటా పాయింట్లను సేకరించారు. ఈ మహానగరాల్లో ధరలు, ఆదాయం, కొనుగోలుశక్తి స్థాయి, తదితరాలను సూచికలుగా తీసుకుని ఈ నివేదికను రూపొందించారు. టాప్–5 నగరాలివే: 1) ముంబై–3,314.7– 2) హనోయి–2,691.4– 3) మెక్సికో సిటీ–2,622.1– 4) న్యూఢిల్లీ–2,511.4–5) బొగొటా–2,357.8 అతి తక్కువ పనిగంటల నగరాలివే:1) లాగోస్–609.4– 2) రోమ్–1,581.4–3) పారిస్–1,662.6– 4) కోపెన్‌హగన్–1,711.9–5) 1,719.6 ఏడాదికి తక్కువ సెలవులు తీసుకున్న వారిలో (సగటున 10,4 రోజులతో) కూడా ముంబైవాసులు కింది నుంచి అయిదో స్థానంలో నిలిచారు. మొదటి నాలుగుస్థానాల్లో లాగోస్, హనోయి, బీజింగ్, లాస్ఏంజిల్స్ నగరాలున్నాయి. అత్యధికంగా 37 రోజుల సెలవులతో రియాద్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్, బార్సిలోనా, దోహ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం స్టేటస్ సింబల్‌గా, ఖరీదైన మొబైళ్లలో ఒకటిగా పరిగణిస్తున్న ఐ ఫోన్ గీ (టెన్) ఫోన్ కొనేందుకు కైరో వాసి 1,066.2 గంటలు, ముంబై ఉద్యోగి 917.8 గంటలు, న్యూఢిల్లీ పౌరుడు 804 గంటలు పనిచేయాల్సి ఉంటుందని, అదే జూరిచ్లోనైతే 38.2 గంటలు, జెనీవాలో 47.5 గంటలు, లాస్ ఏంజెల్స్‌లో 50.6 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఆయా మహానగరాల్లో ఆర్జించే వేతనాల్లోని వ్యత్యాసాలను కూడా ఈ సర్వే ఎత్తిచూపింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తెలంగాణ బంద్‌కు ముంబైకర్ల మద్దతు
సాక్షి, ముంబై: పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బంద్‌కు మద్దతుగా గురువారం మధ్యాహ్నం ముంబైలోని ములుండ్ అంబేద్కర్ నగర్లో ముంబై టీ జాక్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ముంబైకర్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని టీఆర్ఎస్ ముంబై శాఖ ప్రధాన కార్యదర్శి శివరాజ్ బోల్లె వెల్లడించారు. ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని జాక్ కన్వీనర్ బి. ద్ర విడ్ మాదిగ డిమాండ్ చేశాడు. ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులుగా నిజామాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ చాకు లింగం పద్మశాలి తో పాటు భివండీ నుంచి బోగ సుదర్శన్ పద్మశాలి, గాది లక్ష్మణ్, జి. ఏసుదాస్, జి. లక్ష్మణ్ మాదిగ, కె. శేఖర్ మాదిగ, రామగిరి శంకర్, కె. సాయిలు తదితరులు పాల్గొన్నారు. కార్మిక నాయకుల ఖండన ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌ను ముంబై మిల్లు కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ ఖండించారు. వెంటనే ఆర్డినెన్స్‌ను తిరిగి వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.