సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటున్న పౌరులకు విమానాల రాకపోకలు హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏ విమానం వచ్చి కూలుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకు ప్రధాన కారణం ముంబైలో ఉన్న దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల రన్‌వేలు నిత్యం బిజీగా ఉండటమే. దీంతో సకాలంలో ల్యాండింగ్‌కు అవకాశం దొరక్క అనేక సందర్భాలలో విమానాలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోందని రవాణ శాఖ సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విమానంలో ఏదైన సాంకేతిక లోపం తలెత్తిన లేదా పక్షులు ఢీ కొడితే విమానం జనవాసాల మ«ధ్య కూలడం ఖాయం.
జనవాసాల మధ్య చక్కర్లు..
1978లో బాంద్రాలో ఎయిర్ ఇండియా విమానం–855, 1982లో ముంబైలో ఎయిర్ ఇండియా విమానం–403, అంతేకాకుండా 1993, ఏప్రిల్ 26న ఔరంగాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం, ఇటీవల ఘాట్కోపర్‌లో 12 సీట్ల సామర్థ్యమున్న చార్టర్డ్ విమానం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో చాలా మంది దుర్మరణం చెందారు. కాగా, గత పదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం విమానాశ్రయం ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. దీంతో ఒకవేళ విమానాలు కూలితే నష్టం ఊహించలేనంతగా ఉండే అవకాశం ఉంది. ఘాట్కోపర్‌లో అదృష్టవశాత్తు విమానం నిర్మాణంలో ఉన్న భవనంపై కూలడంతో ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు. ఈ తాజా ఘటనతో విమానాల రాకపోకల వల్ల ముంబైకర్లకు పెను ప్రమాదం పొంచి ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. రన్‌వేపై ఇప్పటికే చాలా విమానాలు ఉండటంతో ఇక ల్యాండిండ్ కావాల్సిన విమానాలు జనావాసాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి.
ఇంధనం ఖాళీ అయితే..
నగరంలో దేశీయ, అంతర్జాతీయ ఇలా రెండు విమానాశ్రయాలున్నాయి. ట్రాఫిక్ వల్ల విమానాశ్రయంలోని రన్ వే పై విపరీతమైన భారం పడుతోంది. దీంతో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ముంబైకి వచ్చే విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే విమానంలో అర గంటకు సరిపడా ఇంధనం అదనంగా నిల్వ ఉంటుంది. ముంబై జనవాసాల మీదుగా చక్కర్లు కొట్టే విమానంలో ఏదైన సాంకేతిక సమస్య తలెత్తితే లేదా రన్‌వే బిజీ కారణంగా ల్యాండింగ్‌కు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాగా, అదే సమయంలో ఇంధనం ట్యాంక్ ఖాళీ అయితే అప్పుడు పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకు వచ్చింది.
నిబంధనల మేరకే..
అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అథారిటీ నియమాల ప్రకారం విమానాశ్రయం నగరం బయట ఉండాలి. ఎదైనా ప్రమాదం జరిగితే ప్రాణ హాని ఎక్కువ శాతం జరగదని దీని వెనక ముఖ్యోద్దేశం. కానీ, నాలుగైదు దశాబ్ధాల కిందట ముంబైలో దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినప్పుడు చుట్టుపక్కల జనవాసాలు అంతగా లేవు. కాలక్రమేణా విమానాశ్రయం చుట్టూ నక్షత్రాల హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, మధ్య తరగతి, పేదలు ఇలా అనేక రకాల జనవాసాల బస్తీ పెరిగిపోయింది. ఫలితంగా విమానాశ్రయాలు నగరం నడిబొడ్డున ఉన్నట్లే ఉన్నాయి. మరోపక్క విమానాల రాకపోకలు పెరగడంతో ఇక్కడ పడుతున్న భారాన్ని తగ్గించేందుకు నవీముంబైలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఉందని విమానాశ్రయం వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందుకు స్థల సేకరణ పనులు పూర్తయ్యాయి. రన్‌వేకు అడ్డు వస్తున్న భారీ ఉలవే కొండను నేల మట్టంచేసే పనులు ఇదివరకే ప్రారంభమైన విషయం విదితమే. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నిర్మాణం కూడా అడవిలో జరుగుతోంది. కొన్ని దశాబ్ధాల తరువాత ఈ ప్రాంతంలో కూడా జనవాసాల బస్తీలు వెలుస్తాయని చెప్పడంలో సంశయం లేదు. అప్పుడూ ఇదే పరిస్థితి ఎదురుకావడం ఖాయం.
రోజుకు 950 విమానాలు..
ముంబై విమానాశ్రయంలో రోజుకు 950 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. గంటకు 45 విమనాలు ల్యాండింగ్, టేకాప్ అవుతుంటాయి. విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న కుర్లా ప్రాంతంలో 1.20 లక్షల జనాలు, ఘాట్కోపర్, శాంతాకృజ్‌లో 90 వేల చొప్పున, విలేపార్లేలో 80 వేల మంది జనాలు ఉంటారు. విమానాశ్రయం పరిసరాల్లో కుర్లా, ఘాట్కోపర్‌లో చిన్న, చిన్న కొండలున్నాయి. కొండపై అనేక పేదల గుడిసెలున్నాయి. అవి రన్ వేకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇంటి పైకప్పు పై నిలబడి చేయి పైకెత్తితే విమానం తగులుతుందా అనే అనుమానం వస్తుంది. దీన్ని బట్టి ఆ గుడిసెలు విమానాశ్రయానికి ఎంత దగ్గరున్నాయో ఇట్టే అర్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment