పోలీసులకు ఫిట్‌నెస్‌ ప్రోగ్రాం | Mumbai Police Launches Fitness Programme For Its Personnel | Sakshi
Sakshi News home page

పోలీసులకు ఫిట్‌నెస్‌ ప్రోగ్రాం

Published Tue, Jul 27 2021 3:52 AM | Last Updated on Tue, Jul 27 2021 3:52 AM

Mumbai Police Launches Fitness Programme For Its Personnel - Sakshi

సాక్షి, ముంబై: కరోనా కాలంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని కోల్పోయిన ముంబై పోలీసు శాఖ భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఈ మేరకు ముంబై పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఫిట్‌నెస్‌ పట్ల అవగాహన కల్పించాలని నిర్ణయించింది. తమ పోలీసులు ఫిట్‌గా ఉండేలా చూసుకునేందుకు ప్రత్యేక ఫిట్‌నెస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు పోలీసులకు ఫిట్‌నెస్‌పై అవగాహన, కౌన్సెలింగ్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ముంబై పోలీసు కమిషనర్‌ హేమంత్‌ నగరాలే వెల్లడించారు. దీన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు స్వయంగా ఆయనే చొరవ తీసుకుంటున్నారు. ఈ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ కోసం వీరు ద ఇండియన్‌ న్యూట్రిషన్‌ కోచ్‌ అనే సంస్థతో కలిసి పనిచేయనున్నారు. ఈ సంస్థను ప్రస్తుతం పోలీసు విభాగంలోనే ఎస్సైగా పనిచేస్తున్న ఒకరి కూతురు నడుపుతోంది. ఈ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ముంబైలోని పోలీసు స్టేషన్లలో ఎంత మంది పోలీసులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..? వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలున్నాయి..? 45 ఏళ్ల పైబడిన వారు ఎంతమంది ఉన్నారు..?

తదితర వివరాలు సేకరిస్తారు. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారిని, 45 ఏళ్ల పైబడిన వారిని మొదటి గ్రూపులో చేరుస్తారు. వారికి ఒక్కొక్కరిగా కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు వారు ఎలాంటి ఆహారం తినాలి, ఏది తినవద్దు, ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు చేయాలి, రోజువారీ దినచర్య ఎలా ఉండాలి తదితర అంశాలపై మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. దీనికోసం ప్రభుత్వం ఒక్కో పోలీసుపై రూ. 3 వేల వరకు అదనంగా ఖర్చు చేయనుంది. ఇలా నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల నుంచి సేకరించిన వివరాల ప్రకారం దశలవారీగా సిబ్బందిని ఎంపిక చేసి వారికి ఫిట్‌నెస్‌పై శిక్షణ ఇస్తారు. ప్రస్తుతానికి ఘట్కోపర్, పంట్‌ నగర్, ఆర్‌సీఎఫ్, శివాజీ నగర్, ట్రాంబే పోలీసు స్టేషన్ల నుంచి ఒక్కో స్టేషన్‌ నుంచి 20 మంది చొప్పున 100 మందితో తొలి బ్యాచ్‌ను జూలై 19న ప్రారంభించారు.  

కరోనాతో 122 మంది పోలీసుల మృతి 
కరోనా మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు విశ్రాంతి లేకుండా అహోరాత్రులు విధులు నిర్వర్తిస్తున్నారు. సమయానికి భోజనం, తగినంత విశ్రాంతి లేక, నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కరోనా వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు నడుం బిగించారు. దీర్ఘకాలిక సెలవులు, వారాంతపు సెలవులను కూడా ప్రభుత్వం రద్దు చేయడంతో విశ్రాంతి అనేది లేకుండా వారు విధులు నిర్వర్తించారు. 24 గంటలు నాకా బందీలు, తనిఖీలు, కాలక్షేపానికి బైక్‌లపై తిరుగుతున్న యువతను అడ్డుకోవడం, అనవసరంగా రోడ్లపై తచ్చాడుతున్న వారిని పట్టుకుని చర్యలు తీసుకోవడం లాంటి పనులు చేపట్టారు.

ఫలితంగా కరోనా సోకి 2020లో ముంబై పోలీసు శాఖలో పనిచేస్తున్న 19 మంది పోలీసులు చనిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 122కి పెరిగింది. ఒక్క ముంబైలోనే 122 మంది పోలీసులు కరోనా కాటుకు బలికావడాన్ని ముంబై పోలీసు కమిషనర్‌ హేమంత్‌ నగరాలే జీర్ణించుకోలేకపోయారు. దీంతో పోలీసు సిబ్బందిలో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వెంటనే ఈ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. అంతేగాక, పోలీసు శాఖలో అనేక మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లకు భారీ పొట్ట ఉంది. వీరేం పరుగెడతారు..? దొంగలను ఎలా పట్టుకుంటారు...? అంటూ ప్రజలు వీరిపై జోకులు వేస్తున్నారు. ఇలాంటి వారివల్ల పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. అంతేగాక బానెడు పొట్ట వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. దీంతో ఇలాంటి వారిని కూడా ఎంపిక చేసి పొట్ట తగ్గించేందుకు ఎలాంటి ఎక్సర్‌సైజ్‌లు చేయాలో కూడా ఈ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా నేర్పించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement