విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం | UGC focus on mental and physical health of students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం

Published Fri, May 26 2023 4:05 AM | Last Updated on Fri, May 26 2023 1:01 PM

UGC focus on mental and physical health of students - Sakshi

సాక్షి, అమరావతి: విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్య శ్రేయస్సుపై ఉన్నత విద్యాసంస్థలు దృష్టి సారించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సూచిస్తోంది. ఇందులో భాగంగా కళాశాలలు, వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థి సేవాకేంద్రాలను (ఎస్‌ఎస్‌సీలను) ఏర్పాటు చేయాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది.

తాజాగా విద్యార్థుల సమస్యలను సమగ్రంగా  అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించనుంది. అనంతరం విద్యార్థులకు మేలు చేసేలా కమిటీ సిఫారసులను ఎస్‌ఎస్‌సీల ద్వారా అమలు చేయాలని యోచిస్తోంది.  

సంపూర్ణ సహకారం అందించేలా.. 
విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో సామాజిక వైవిధ్యాన్ని అర్థం చేసుకుని వారి భావోద్వేగాలను పరస్పరం గౌరవించేలా ఎస్‌ఎస్‌సీలు పనిచేస్తాయి. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులపై శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఒత్తిడిని అధిగమించేలా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి ఆరోగ్య సలహాదారులు, శారీరక, మానసిక ఆరోగ్య నిపుణుల సేవలను అందుబాటులో ఉంచుతారు.

ఈ మేరకు కళాశాలలకు సమీపంలోని అంకితభావం కలిగిన మానసిక వైద్యనిపుణులతో పాటు ప్రఖ్యాత వైద్యసంస్థలు ఎయిమ్స్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్స్‌స్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌–నిమ్హాన్స్‌)తో ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. ఆయా కళాశాలల్లోని సైకాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాల నిపుణుల సేవలను ప్రాజెక్టు డ్రివెన్‌మోడ్‌లో వినియోగించుకోవాలని పేర్కొంది. 

సింగిల్‌విండో సేవలు  
సైకాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సైకియాట్రీ, సోషల్‌ వర్క్, సోషి­యాలజీ విభా­గాల్లో అనుభవం గడించిన ప్రొఫెసర్లు విద్యార్థి సేవాకేంద్రాన్ని డైరెక్టర్‌/డీన్‌ హోదా­లో నిర్వహించనున్నారు. పరిస్థితులకు అనుగు­ణం­గా ఆన్‌లైన్, వ్యక్తిగతంగా, టెలిఫోన్, గ్రూప్‌ కాలింగ్‌ కౌన్సెలింగ్‌ సెషన్ల ద్వారా విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యసేవలను అందించనున్నారు.

కళాశాలల్లో విద్యా­ర్థు­ల ఆత్మహత్యలు అరికట్టడంతోపాటు డ్రాపౌ­ట్‌ రేట్లను తగ్గించే లక్ష్యంతో సింగిల్‌విండో పద్ధతిలో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. విద్యార్థుల్లో ఫిట్‌నెస్‌ సామర్థ్యాన్ని పెంచడానికి జిమ్‌లు, యోగా సెంటర్లు నిర్వహించ­డం­తోపాటు ఇండోర్, ఔట్‌డోర్‌ క్రీడా ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ తప్పనిసరిగా ఇవ్వా­లని యూజీసీ మార్గదర్శకాల్లో పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement