మిజోరాంలో ప్రమాదానికి గురైన మయన్మార్‌ సైనిక విమానం.. | Myanmar Military Aircraft Skids Off Runway In Mizoram | Sakshi
Sakshi News home page

రన్‌వేపై జారిపడిన మయన్మార్‌ సైనిక విమానం.. ఎనిమిది మందికి గాయాలు

Published Tue, Jan 23 2024 12:35 PM | Last Updated on Tue, Jan 23 2024 1:02 PM

Myanmar Military Aircraft Skids Off Runway In Mizoram - Sakshi

ఐజ్వాల్‌: మిజోరంలో మయన్మార్‌ ఆర్మీకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. మయన్మార్‌ నుంచి వచ్చిన సైనిక విమానం రన్‌వేపై దిగుతుండగా అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. మిజోరాంలోని లెంగ్‌పుయ్‌ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకుంది. 

ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్‌ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో జరుగుతున్న అతర్యుద్ధం కారణంగా సరిహద్దుల దాటి భారత్‌లోని మిజోరం రాష్ట్రంలోకి చొరబడిన మయన్మార్ సైనికులను స్వదేహానికి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది.

కాగా టేబుల్‌టాప్‌ రనేవేలు (పీఠభూమి లేదా ఎత్తైన కొండ పైభాగం ప్రాంతాల్లో నిర్మించిన రన్‌వే) సవాలుతో కూడుకొని ఉన్నాయి. ఇలాంటి రన్‌వేలో భారత్‌లో ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి వల్ల  విమానాలు ల్యాండింగ్‌ అవుతున్న సమయాల్లో రన్‌వే నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది.
చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు

ఇక మయన్మార్‌లో తిరుగుబాటు గ్రూపులతో జరుగుతోన్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో ఆ దేశం నుంచి భారీగా  సైనికులు భారత్‌లోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరాంలోకి ప్రవేశించారని, వీరిలో  184 మంది సైనికులను భారత్‌ సోమవారం వెనక్కి పంపినట్లు అస్సాం రైఫఙల్స్‌ సోమవారం పేర్కొంది. 

స్వతంత్ర రాఖైన్‌ రాష్ట్ర కోసం పోరాటం చేస్తున్న మయన్మార్‌ తిరుగుబాటు బృందం ‘అరాకన్‌ ఆర్మీ’ సాయుధులు గతవారం దేశ సైనిక క్యాంప్‌పై దాడి చేసి ఆక్రమించుకున్నారు. దీంతో మయన్మార్‌ సైనికులు మిజోరాంలోని లాంగ్ట్లై జిల్లాలోని భారత్‌-మయన్మార్-బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ వద్ద ఉన్న బందుక్‌బంగా గ్రామం ద్వారా దేశంలోకి ప్రవేశించి అస్సాం రైఫిల్స్‌ క్యాంప్‌లో లొంగిపోయారు.  వీరి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి.

మయన్మార్ సైనికులను పర్వాలోని అస్సాం రైఫిల్స్ శిబిరానికి తరలించారు. అనంతరం వారిని లుంగ్లీకి మకాం మార్చారు. ఐజ్వాల్ సమీపంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు మయన్మార్ వైమానిక దళానికి చెందిన విమానాల్లో  సైనికులను స్వదేశానికి పంపే ప్రక్రియ ప్రారంభించినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి ఒకరు తెలిపారు.  మిగిలిన 92 మంది సైనికులను నేడు మయన్మార్‌ తరలిస్తామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement