మోదీ మోత.. గుజరాత్‌లో కొత్త చరిత్ర   | Narendra Modi Mania in Gujarat Elections Results 2022 | Sakshi
Sakshi News home page

మోదీ మోత.. గుజరాత్‌లో కొత్త చరిత్ర  

Published Fri, Dec 9 2022 5:27 AM | Last Updated on Fri, Dec 9 2022 6:42 AM

Narendra Modi Mania in Gujarat Elections Results 2022 - Sakshi

థాంక్యూ గుజరాత్‌ 
‘‘గుజరాత్‌ ఎన్నికల ఫలితాలను చూశాక ఎన్నోరకాల భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. అభివృద్ధి రాజకీయాలను ప్రజలు దీవించారు. థాంక్యూ గుజరాత్‌. అభివృద్ధి ఇదే వేగంతో కొనసాగాలని వారు కోరుకున్నారు. గుజరాత్‌ జనశక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. బీజేపీ కార్యకర్తల రెక్కల కష్టం లేకుంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. ప్రతి కార్యకర్త ఒక ఛాంపియన్‌. మా పార్టీకి అసలైన బలం కార్యకర్తలే. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు సైతం బీజేపీపై ఆప్యాయత కనబర్చారు. మద్దతుగా నిలిచారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి శ్రమిస్తూనే ఉంటాం. సమయం వచ్చినప్పుడల్లా వారి సమస్యలను లేవనెత్తుతాం’’  
– ప్రధాని నరేంద్ర మోదీ

అహ్మదాబాద్‌: మోదీ మేజిక్‌ మరోసారి అద్భుతం చేసింది. గుజరాత్‌లో కమలం పార్టీ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను, తానే ప్రత్యామ్నాయమంటూ బరిలో దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీని బీజేపీ బుల్‌డోజర్‌ అక్షరాలా మట్టికరిపించింది. ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపడుతూ 182 అసెంబ్లీ స్థానాలకు గాను 156 సీట్లను సొంతం చేసుకుంది. నాలుగింట మూడొంతులకు పైగా మెజారిటీ సాధించింది.

తద్వారా 1985లో మాధవ్‌సింగ్‌ సోలంకీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన 149 సీట్ల రికార్డును బద్దలు కొట్టింది. 2002లో సీఎంగా మోదీ నేతృత్వంలో సాధించిన 127 సీట్ల స్వీయ రికార్డునూ మెరుగు పరుచుకుంది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు నెగ్గిన పార్టీగానూ రికార్డు సృష్టించింది.

1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీకి ఇది వరుసగా ఏడో విజయం! తద్వారా పశ్చిమబెంగాల్లో సీపీఎం కూటమి సాధించిన ఏడు వరుస విజయాల రికార్డును బీజేపీ సమం చేసింది. కాంగ్రెస్‌ కేవలం 17 సీట్లతో రాష్ట ఎన్నికల చరిత్రలో అత్యంత ఘోరమైన పరాజయం చవిచూసింది. ఒక్క చాన్సంటూ కేజ్రీవాల్‌ రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఆప్‌కు దక్కింది ఐదు స్థానాలే!


ఆద్యంతమూ జైత్రయాత్రే... 
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్‌ పోటాపోటీగా తలపడటం తెలిసిందే. డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరిగింది. గురువారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్‌ మొదలైంది. మొదటినుంచీ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లింది. పార్టీకి అన్ని వర్గాల నుంచీ సంపూర్ణ మద్దతు లభించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ 77 సీట్లు నెగ్గిన కాంగ్రెస్‌ ఈసారి పూర్తిగా చేతులెత్తేసింది.

అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ ఈసారి జోడో యాత్ర కారణంగా దూరంగా ఉండటం, ప్రియాంక కూడా హిమాచల్‌తో పోలిస్తే గుజరాత్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం ఆ పార్టీ అవకాశాలను మరింతగా దెబ్బ తీశాయి. పులిమీట పుట్రలా ఆప్‌ కూడా హస్తం పార్టీని బాగా దెబ్బ తీసింది. ఆప్, మజ్లిస్‌ కలిసి మైనారిటీ ఓట్లను కూడా చీల్చడం బీజేపీకి మరింత కలిసొచ్చింది.

ఆప్‌కు కూడా ఘోర పరాజయమే మూటగట్టుకుంది. పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్‌ గాఢ్వీతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు తదితరులంతా ఓటమి పాలయ్యారు. 2017లో దెబ్బ తీసిన పాటిదార్ల ఉద్యమం, జీఎస్టీపై వ్యాపారుల కన్నెర్ర వంటి సమస్యలేవీ లేకపోవడంతో ఈసారి బీజేపీ జైత్రయాత్ర నిర్నిరోధంగా కొనసాగింది. ఘనవిజయం ఖాయం కావడంతో పార్టీ కార్యకర్తలు సంబరాలకు తెర తీశారు. 

మళ్లీ భూపేంద్రే సీఎం 
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ (60) అహ్మదాబాద్‌లోని ఘాట్‌లోడియా స్థానం నుంచి 1.92 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సీఎంగా ఆయనే కొనసాగనున్నారు. డిసెంబర్‌ 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు.  

బీజేపీ రికార్డు విజయం వెనక... ముచ్చటగా మూడు కారణాలు 
దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే గుజరాత్‌లో కూడా సామాన్యుల్లో చాలా అంశాలపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ధరల పెరుగుదల మొదలుకుని నానా రకాల సమస్యలతో వాళ్లు కూడా సతమతమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా భావించే పాడి పరిశ్రమపై ఆధారపడ్డ అసంఖ్యాకులు ద్రవ్యోల్బణం దెబ్బకు లాభాలు సన్నగిల్లి అల్లాడుతున్నారు. వారంతా దీన్ని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యంగానే చూశారు.

సంపన్న సూరత్‌ వస్త్ర వ్యాపారుల నుంచి మధ్య గుజరాత్‌లోని నిరుపేద పొగాకు రైతుల దాకా అందరిదీ ఇదే వ్యథ, ఇదే అభిప్రాయం. అయినా సరే, బీజేపీకి ఓటేయడం మినహా మరో మార్గం లేదన్న భావన వారిలో ప్రబలంగా వ్యక్తమవడం విశేషం! 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత కన్పించకపోవడం మరో విశేషం. ఇందుకు మూడు కారణాలు ప్రధానంగా కన్పిస్తున్నాయి. హిందూత్వ నినాదం, ప్రధాని మోదీ మేజిక్, విపక్ష ఓటులో చీలిక. ఈ మూడూ కలగలిసి బీజేపీకి కళ్లుచెదిరే విజయం కట్టబెట్టాయి. 

హిందూత్వ నినాదం 
హిందూత్వ రాజకీయాలు గుజరాత్‌లో చిరకాలంగా లోలోతులకు పాతుకుపోయాయి. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాష్ట్రంలో సన్నకారు పాడి రైతు మొదలుకుని పాటిదార్‌ పత్తి రైతు దాకా ఎవరిని కదిలించినా ద్రవ్యోల్బణం దెబ్బకు రెండు మూడేళ్లలో ఆర్థికంగా అక్షరాలా చితికిపోయామంటూ వాపోయినవాళ్లే. కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నది వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట!

ముస్లింల ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే మరో మార్గం లేదన్నది వారు వెలిబుచ్చిన అభిప్రాయం. ‘‘గతంలో అహ్మదాబాద్‌ వెళ్లాలంటే ‘గొడవ’లేమన్నా అవుతున్నాయా అని ముందుగా వాకబు చేయాల్సొచ్చేది. కానీ సాహెబ్‌ (మోదీ) వచ్చాక అల్లర్లూ లేవు, సమస్యలూ లేవు’’ అని సగటు హిందూ ఓటర్లంతా చెప్పుకొచ్చారు. ఈ ముస్లిం వ్యతిరేక భావజాలం వారిలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. మతపరమైన విభజన ఆర్థిక కష్టాలను కూడా వెనక్కు నెట్టేసేంది. ఇదే బీజేపీకి శ్రీరామరక్షగా మారింది. 

మోదీ మేనియా 
సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తటస్థ, ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లు మోదీ కరిష్మా కారణంగా బీజేపీవైపే మొగ్గినట్టు ఫలితాల సరళి స్పష్టంగా చెబుతోంది. నిజానికి అధికార బీజేపీ ఎమ్మెల్యేల అసమర్థత, అధికారుల్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని రాష్ట్రంలో జనం అసహ్యించుకునే పరిస్థితి ఉంది! కానీ మోదీ మేనియా వీటన్నింటినీ చాలావరకు అధిగమించేసింది. 

విపక్ష ఓటులో చీలిక 
గుజరాత్‌లో ఎప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య సాగుతూ వచ్చిన పోరు కాస్తా ఆప్‌ అన్ని అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగడంతో ముక్కోణ పోరుగా మారిపోయింది. కేజ్రీవాల్‌ పార్టీ ప్రధానంగా చీల్చింది బీజేపీ వ్యతిరేక ఓటునే! అంటే కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకునే!! అంతిమంగా ఇది ప్రధాన ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బగా, బీజేపీకి అనుకోని వరంగా పరిణమించింది. ఈ కారణంగానే కమలం పార్టీ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 150 సీట్ల మార్కును దాటగలిగింది. ఏకంగా 53 శాతం ఓట్లు కొల్లగొట్టింది.

మరోవైపు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు 41 శాతం నుంచి 27 శాతానికి పడిపోయింది. ఆప్‌ సాధించిన 13 శాతం ఓట్లు చాలావరకు కాంగ్రెస్‌నని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. 2017లో కాంగ్రెస్‌ దుమ్ము రేపిన సౌరాష్ట్ర ప్రాంతాన్ని కూడా బీజేపీ ఈసారి పూర్తిగా తనవైపు తిప్పుకుంది. కానీ ఇక్కడ ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఆప్‌ రెండింటి ఓట్ల శాతం కలిపితే బీజేపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం! పైగా 2017లో బీజేపీకి చెమటలు పట్టించి కాంగ్రెస్‌కు చాలావరకు ఉపయోగపడ్డ పాటిదార్‌ ఉద్యమం వంటివేవీ ఈసారి లేకపోవడం కమలనాథులకు మరింతగా కలిసొచ్చింది.                            
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement