![National Police Commemoration Day 2023: 65 pc fall in incidents of terrorism - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/22/211020230236-PTI10_21_2023_.jpg.webp?itok=Al46gx-4)
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో విద్రోహ చర్యలు గత దశాబ్ద కాలంలో 65 శాతం మేర తగ్గుముఖం పట్టాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని మూడు హాట్ స్పాట్లుగా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, జమ్మూకశ్మీర్‌ల్లో పరిస్థితులు ప్రశాంతంగా మారాయన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావడంతోపాటు ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తుండడమే దీనికి కారణమన్నారు.
శనివారం నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి అమిత్ షా మాట్లాడారు. పోలీస్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేసి పోలీసు బలగాలను తీవ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
దాదాపు 150 ఏళ్లనాటి క్రిమినల్ జస్టిస్ విధానాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం పార్లమెంట్‌లో మూడు బిల్లులను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో 36,250 మంది పోలీసులు ప్రాణాలర్పించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు 188 మంది పోలీసులు విధుల్లో ఉండగా అమరులయ్యారు. పోలీసు స్మారకం కేవలం చిహ్నం కాదు, దేశ నిర్మాణం కోసం పోలీసు సిబ్బంది చేసిన త్యాగం, అంకితభావానికి గుర్తింపు’అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతర్గత రక్షణతోపాటు దేశ సరిహద్దుల భద్రతకు సైతం సమర్థమంతమైన పోలీసు విధానం అవసరం ఎంతో ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment