సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రూయిజ్ టూరిజాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు జాతీయ వ్యూహానికి రూపకల్పన చేసినట్టు పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏడు కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని జాతీయ వ్యూహానికి రూపకల్పన చేసినట్టు తెలిపారు.
జాతీయ వ్యూహంలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్క్యూట్ ఎనేబుల్‌మెంట్, మార్కెట్ డెవలప్మెంట్, సులభతర వాణిజ్యం, టెర్మినల్ చుట్టూ ఇంటిగ్రేటెడ్ టూరిజం, పెట్టుబడులను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సంస్థాగత నిర్మాణం, పరిపాలన మొదలైన అంశాలు క్రూయిజ్ టూరిజానికి ప్రధాన స్తంభాలుగా గుర్తించినట్టు తెలిపారు. విశాఖపట్నంలో క్రూయిజ్ కమ్ కోస్టల్ కార్గో టెర్మినల్ ప్రారంభమైందని వెల్లడించారు.
కేబుల్ టీవీ చట్టం స్థానంలో బ్రాడ్‌కాస్టింగ్ బిల్లు
అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, స్వీయ నియంత్రణ ఆవశ్యకత దృష్ట్యా ప్రస్తుతం ఉన్న కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నియంత్రణ చట్టం–1995 స్థానంలో బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు–2023ని తీసుకువస్తున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
తూర్పు కనుమల్లో సర్వే అవసరం లేదు
దేశంలోని అడవుల విస్తీర్ణం, అటవీ భూముల కోతపై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రెండేళ్లకోసారి సర్వే చేస్తోందని.. అందువల్ల తూర్పు కనుమల్లో అటవీ భూముల కోతపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
వర్చువల్ కోర్టు అమలులో లేదు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి వర్చువల్ కోర్టు అమలులో లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. వర్చువల్ కోర్టులను స్థానిక హైకోర్టులతో సంప్రదింపులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని.. ఇందులో కేంద్రానికి నేరుగా ప్రమేయం ఉండదని వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
288 బీచ్‌ల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
తీర ప్రాంతంలో 288 బీచ్‌ల అభివృద్ధికి, కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్లాన్–2019లో చేర్చడానికి ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీకి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పంపినట్టు ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గండికోట, అరకు–లంబసింగి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి స్వదేశీ దర్శన్–2.0లో చేర్చినట్టు వైఎస్సార్‌సీపీ సభ్యుడు బీద మస్తానరావు ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment