సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో అదనంగా 0.5 శాతం రుణాల సేకరణకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్విఘ్నంగా అమలు చేయగలుగుతుందన్నారు. రాష్ట్ర విభజన నాటినుంచి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో సతమతమవుతోందని తెలిపారు. రాజ్యసభలో గురువారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా విజయసాయిరెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తోందన్నారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన తీరని అన్యాయం కారణంగా రెవెన్యూ వనరులన్నీ తెలంగాణకు తరలిపోయాయన్నారు.
అశాస్త్రీయ విభజన వల్ల ఏపీ ఇప్పటికీ భారీ రెవెన్యూ లోటుతో సతమతమవుతూనే ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు అనివార్యమని 14వ ఆర్థిక సంఘం కూడా స్పష్టం చేసిందన్నారు. రెవెన్యూ లోటు కారణంగా అనేక ఇబ్బందులు, అవరోధాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి కూడా ఆశించిన సాయం అందకపోయినా సీఎం వైఎస్ జగన్ నవరత్నాల ద్వారా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారని చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 45% మూలధన వ్యయం చేసిన ఏడు రాష్ట్రాలకు జీఎస్‌డీపీలో అదనంగా 0.5 శాతం రుణం సేకరించుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించిందన్నారు. మూలధన వ్యయం అనే నిబంధన విధించడం ద్వారా రెవెన్యూ లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరోమారు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో సవాళ్లను పరిష్కరించి, ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు రాష్ట్రాలతో నేరుగా సంప్రదింపులు జరుపుతామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు.
విశాఖలో రూ.96 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్: కిషన్‌రెడ్డి
సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లోని ఔటర్ హార్బర్‌లో క్రూయిజ్ టెర్మినల్ బెర్త్, టెర్మినల్ భవనం నిర్మాణం కోసం కేంద్రం రూ.96 కోట్లు కేటాయించిందని పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. అలాగే క్రూయిజ్ కమ్ కోస్టల్ కార్గో టెర్మినల్ నిర్మాణం కోసం రూ.38 కోట్లు కేటాయించిందన్నారు.స్వదేశ్ దర్శన్ పథకం కింద కాకినాడ వద్ద హోప్ ఐలాండ్, కోరింగ వన్యమృగ సంరక్షణ కేంద్రం, పాశర్లపూడి, ఆదూరు, ఎస్.యానాం, కోటిపల్లిల్లో పర్యాటక వసతుల కోసం రూ.67 కోట్లు కేటాయించామన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సు, ఉబ్బలమడుగు జలపాతం, నేలపట్టు, కొత్తకోడూరు, మైపాడు, రామతీర్థం, ఇసుకపల్లి వద్ద పర్యాటక వసతుల కోసం రూ.49 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కాగా భవన నిర్మాణ పనులపై పర్యావరణ శాఖ మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉందని ఆ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ రాజ్యసభలో తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య 42.5 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రులు జవాబిచ్చారు.
ఈ–శ్రమ్‌లో 7,29,447 మంది నమోదు
ఈ–శ్రమ్ పోర్టల్‌లో డిసెంబర్ 2 నాటికి 7,29,447 మంది గిగ్ వర్కర్లు పేరు నమోదు చేసుకున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈశాన్య ప్రాంతాల పట్టణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఐదు రాజధాని నగరాలకు 84 ప్రాజెక్టులు, ప్యాకేజీలు మంజూరు చేశామని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎంపీ అయోధ్యరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 5జీ ప్రసారం వంటివాటికి అనుగుణంగా డిజిటల్ టెరెస్ట్రియల్ బ్రాడ్‌కాస్టింగ్ కోసం రోడ్ మ్యాప్‌ను అభివృద్ధి చేయడానికి ప్రసార భారతి.. ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు ఎంపీ పరిమళ్ నత్వానీ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అదనపు రుణ సేకరణకు ఏపీని అనుమతించండి
Published Fri, Dec 10 2021 5:11 AM | Last Updated on Fri, Dec 10 2021 8:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment