ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. 90 స్థానాలకుగానూ 48 స్థానాల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ క్రమంలో అక్టోబర్ 15న హర్యానాలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 15న పంచకులలో సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పంచకులలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుబాటులో ఉంటారో లేదో అనేది తెలియాల్సి ఉందని, ఆయన ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
హర్యానా ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచకుల డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కూడిన అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంచకుల అదనపు డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా సభ్యులుగా ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీవీఎస్‌ఎన్ ప్రసాద్ గురువారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు.
కాగా ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసిన విషయం తెలిసిందే. సైనీ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది బీజేపీ... మరోసారి బీసీ నేత అయిన ఆయనకే రాష్ట్ర పగ్గాలను అప్పగించనుంది అధిష్టానం. ముఖ్యమంత్రితోపాట మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment