
న్యూఢిల్లీ: నీట్ పీజీ 2022 పరీక్షను 6– 8 వారాలు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈమేరకు పరీక్ష వాయిదా వేయాలని జాతీయ పరీక్షల బోర్డు (ఎన్‌బీఈ)ని కోరింది. ప్రభుత్వ ఆదేశం మేరకు పరీక్షను మార్చి 12 నుంచి మే 21కి వాయిదా వేస్తున్నట్లు ఎన్‌బీఈ ఎంఎస్(మెడికల్ సైన్సెస్) శుక్రవారం ప్రకటించింది. మే 21 ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపింది. పరీక్ష దరఖాస్తుకు ఆన్‌లైన్ విండో గడువు ఈనెల 4న ముగుస్తుండగా, ఈ గడువును మార్చి 25 రాత్రి 11.55 గంటల వరకు పొడిగించింది. నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ తేదీలతో నీట్ పీజీ 22 పరీక్ష తేదీలు ముడిపడుతున్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఫిబ్రవరి 8న విచారణ
నీట్ పరీక్ష వాయిదా వేయాలంటూ గత నెల్లో కొందరు విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 8న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తమ దృష్టికి వచ్చిందని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. మరోవైపు నీట్ పరీక్షపై చర్చకు డీఎంకే సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీనికి సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు అంగీకరించలేదు. దీంతో నిరసనగా కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment