న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తీసుకోవడంపై సమాజంలో అపోహలు ఉన్నాయని నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. మంగళవారం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని వ్యాక్సిన్ సంబంధిత అంశా లపై మాట్లాడారు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 0.18 శాతం మందిలో మాత్రమే ప్రతికూల ప్రభావాలు కనిపించాయని, 0.002 శాతం మంది మాత్రమే ఆస్పత్రి వరకూ వెళ్లాల్సి వచ్చిందన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రతికూల ప్రభావాలు చాలా తక్కువ అని తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండూ సురక్షితమైనవేనని తేల్చి చెప్పారు. అందుకు సాక్ష్యంగా తానే కోవాగ్జిన్ టీకాను తీసుకున్నట్లు వెల్లడించారు. కొందరు వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. వారిని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరారు. వ్యాక్సినేషన్ చేస్తున్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మొదటి రోజునే చాలా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పొందడం సామాజిక బాధ్యత అని చెప్పారు.
ఏడు నెలల్లో అత్యల్ప కేసులు
దేశంలో 24 గంటల్లో బయట పడిన కేసుల సంఖ్య ఏడు నెలల్లో అత్యల్పం కాగా, మరణాల సంఖ్య కూడా దాదాపు ఎనిమిది నెలల కనిష్టానికి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన వివరాల ప్రకారం.. 24 గంటల్లో 10,064 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837కు చేరుకున్నాయి. అదే సమయంలో కరోనా కారణంగా 137 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,52,556కు చేరుకుందని ఆరోగ్యశాఖ తెలిపింది.
టీకానంతరం దుష్ఫలితాలు వస్తే..
సాధారణంగా క్లినికల్ ట్రయల్ మోడ్‌లో వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో మూడు రకాల డాక్యుమెంట్లు ఉంటాయని అన్నారు. మొదటిది ఫ్యాక్ట్‌షీట్ వివరాలు, రెండోది కన్సెంట్ ఫామ్, మూడోది దుష్ఫలితాల ఫామ్ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు. చెప్పారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న ఏడు రోజుల్లోగా దుష్ఫలితం వస్తే, అధికారులే అన్ని ఖర్చలు భరిస్తారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఇచ్చాక అరగంట పాటు పరిశీలనలో ఉంచుతారని, అనంతరం ఇంటికి పంపించి ఏడు రోజుల పాటు ప్రతిరోజూ మానిటర్ చేస్తారని తెలిపారు. వ్యాక్సిన్ సెషన్ల విషయంలో రాష్ట్రాలకు నిర్ణయ వెసులుబాటును ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment