‘‘కోవిడ్–19 కారణంగా మనదేశంలో ఇప్పటిదాకా దాదాపు 1.35 లక్షల మంది చనిపోయారు. కరోనా దెబ్బకు కుదేలయ్యాం. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా? అని ఇప్పుడు ప్రపంచమంతా క్షణమొక యుగంగా గడుపుతోంది. కరోనా వైరస్‌ను తుదముట్టించే వ్యాక్సిన్ తయారీలో దాదాపు 200 కంపెనీలు తలమునకలై ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మనదగ్గర మరణాలు కాస్త తక్కువే అయినా, ప్రస్తుతం కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. అందుకే ఇప్పుడు వ్యాక్సిన్ కోసం యావత్తు దేశం ఎదురుచూస్తోంది. (రష్యాలో టీకా షురూ)
‘‘మరి ఏకంగా కోటిన్నర మంది చనిపోతే... పిట్టల్లా రాలిపోతే ఎంతగా అల్లాడిపోయి ఉంటారో కదా! 1918–20 మధ్యకాలంలో స్పానిష్ ఫ్లూ ప్రబలిన సమయంలో మనదేశంలో ఏకంగా కోటిన్నర (ఈ సంఖ్య ఇంకా ఎక్కువనే వాదనా ఉంది) మంది బలైపోయారు. అప్పుడు టీకా కోసం ఎంతగా ఎదురుచూసి ఉంటారో? కానీ విచిత్రమేమిటంటే... నాడు మనదేశంలో అసలు వ్యాక్సినే అందుబాటులోకి రాలేదు. ఒక్కరికి కూడా టీకా పడలేదు. చివరకు హెర్డ్ ఇమ్యూనిటీతోనే వైరస్ అంతమైపోయింది’’
సాక్షి, హైదరాబాద్ : ఇన్‌ఫ్లూయెంజా అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది 1918 నాటి స్పానిష్ ఫ్లూ. మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన వెంటనే ఇది ప్రబలింది. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల మందిని (ఈ సంఖ్యపై భిన్నాభిప్రాయాలున్నాయి) బలితీసుకుంది. కోటిన్నర మరణాలతో స్పానిష్ ఫ్లూతో ఎక్కువ మంది చనిపోయిన దేశంగా ఇండియా చరిత్రలో నిలిచింది. దీని బారినపడి ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యాయి. కొన్నిచోట్ల శవాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు రంగంలోకి దిగి వ్యాక్సిన్ తయారీ చర్యలు చేపట్టారు. చివరకు 1938–1940 మధ్య వ్యాక్సిన్ అందుబాటులోకి వచి్చంది. యూకే, యూఎస్, రష్యా సహా పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్లను తయారు చేశారు. 1940లో అమెరికా వ్యాప్తంగా వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచారు. అప్పటి నుంచి దశలవారీగా అమెరికా, యూరప్ సహా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కొనసాగింది. (కరోనా వైరస్: ఎన్నో వ్యాక్సిన్లు..)
90 ఏళ్ల తర్వాత తొలి టీకా..
మన దేశంలో 1920 నాటికే స్పానిష్ ఫ్లూ వల్ల కోటిన్నర మంది చనిపోయినా, దేశంలో ఒక్కరికి కూడా టీకా ఇవ్వలేదు. తొలుత స్పానిష్ ఫ్లూకు బ్యాక్టీరియా కారణమనుకుని 15 ఏళ్లపాటు అదే దిశలో పరిశోధనలు చేశారు. చివరకు 1930 తర్వాత వైరస్ అన్న విషయాన్ని గుర్తించి మళ్లీ కొత్త పరిశోధనలు చేసి పదేళ్లలో పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. ఆ తర్వాత కూడా మన దేశంలో టీకాలు అందుబాటులోకి రాలేదు. అప్పటికే స్పానిష్ ఫ్లూ అంతమైంది. కానీ 1957లో చైనాలో మరోసారి ఇన్‌ఫ్లూయెంజా వెలుగుచూసింది. దానికి ఏషియన్ ఫ్లూగా పేరు పెట్టారు. అదిదాదాపు 40 లక్షల మందిని చంపేసింది. మళ్లీ 1968లో చైనాలోనే మొదలై హాంగ్‌కాంగ్ ఫ్లూ పేరుతో ప్రపంచానికి పాకి మరో 40 లక్షల మందిని బలితీసుకుంది. తర్వాత హెచ్1ఎన్1 వైరస్‌గా స్వైన్‌ఫ్లూ పేరుతో 2009లో అమెరికాలో వెలుగుచూసింది. స్వైన్ ఫ్లూ ప్రబలే సమయానికి కొంతముందుగా ఫ్లూ వ్యాక్సిన్ మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే ఫ్లూ వెలుగు చూసిన 90 ఏళ్లకు తర్వాత మనకు వ్యాక్సిన్ వచ్చింది. తొలుత వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్నా, ఆ తర్వాత మనమే సొంతంగా తయారు చేసుకోవటం ప్రారంభించాం. (వ్యాక్సిన్ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్)
అంతం..హెర్డ్ ఇమ్యూనిటీతోనే
స్పానిష్ ఫ్లూ వచ్చే నాటికి మన దేశంలో కనీస జాగ్రత్తలపై కూడా అవగాహన లేదు. మహమ్మారి అతివేగంగా విస్తరిస్తూ, ప్రజల్లో అవగాహన వచ్చేసరికి లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పట్లో దాదాపు మూడొంతుల మంది భారతీయులకు ఇది సోకిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా హెర్డ్ ఇమ్యూనిటీ (సామూహిక రోగనిరోధక శక్తి పెరగడం) ఏర్పడి మహమ్మారి విస్తరణ ఆగి... వైరస్ దానికదే అంతమైంది. ఆ తర్వాత ఏషియన్ ఫ్లూ, హాంగ్‌కాంగ్ ఫ్లూ ప్రబలినా పెద్దగా ప్రభావం చూపలేదు. చరిత్రలో అతి భయంకర వ్యాధిగా నిలిచిపోయిన స్పానిష్ ఫ్లూను టీకా లేకుండానే మన దేశం ఎదుర్కొనటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment