బిజయ శ్రీ రౌత్రాయ్ (ఫైల్)
భువనేశ్వర్: రాష్ట్ర మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ (68) బుధవారం కన్ను మూశారు. కరోనా చికిత్స నుంచి కోలుకుని ఇతర దీర్ఘకాల రోగాలతో ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు పేర్కొన్నారు. మే నెల తొలి వారంలో ఆయన కోవిడ్ బారిన పడి చికిత్స పొందారు. మాజీ ముఖ్యమంత్రి నీలమణి రౌత్రాయ్ కుమారుడిగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిగా ఆయన పేరొందారు. భద్రక్ జిల్లా బాసుదేవ్‌పూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసన సభకు వరుసగా 6 సార్లు ఎన్నికయ్యారు. అటవీ-పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు విష్ణువ్రత రౌత్రాయ్ ఈ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రజల కోసం పోరాడిన నాయకుడు
మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. బిజయశ్రీ రౌత్రాయ్ నిస్వార్థంతో ప్రజల కోసం పోరాడిన నాయకుడని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సానుభూతి ప్రకటించారు.
ఆయన సేవలు చిరస్మరణీయం
మాజీ మంత్రి బిజయ శ్రీ రౌత్రాయ్ సేవలు చిరస్మరణీయమని గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ సంతాపం ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఒడిశా స్పీకర్ సూర్యనారాయణ పాత్రో, పలువురు మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తదితరులు బిజయ శ్రీ రౌత్రాయ్ మృతి ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment